West Godavari Crime : పశ్చిమగోదావరి జిల్లాలో ఘరానా మోసాలు చేస్తున్న కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆకివీడులలోని జ్యువెలరీ షాపుల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ మహిళ మోసాలకు పాల్పడింది. బంగారు పూత వేసిన పాత నగలను మార్చి అసలైన గోల్డ్ నగలను తీసుకున్న ఘటన వెలుగు చూసింది. మహిళ తెచ్చిన నగలను కరిగించగా వాటిల్లో రాగి ఎక్కువగా ఉందని గోల్డ్ షాపు యజమానులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ చేస్తున్న మోసాలను గురించి, ఆమె ఫొటో, వీడియోలను బంగారం వ్యాపారస్తులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆకివీడులోని జ్యువెలరీ షాపులో నగలు మార్చడానికి వచ్చిన మహిళను ఆ షాపు యజమాని గుర్తించి, నిర్బంధించారు. అయితే ఆ మహిళ తాను మోసం చేయలేదని వాదిస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ లో ఆ నగలు కొన్నట్లు పోలీసులకు రుజువులు చూపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.