చంద్రబాబుతో పవన్ ములాఖత్ ప్యాకేజీ కోసమే..! అప్పుడు ఒంటరిగా.. ఇప్పుడు పొత్తు ఎందుకు..?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్‌లో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై కీలక ప్రకటన చేశారు.. అయితే, చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ ప్యాకేజీ కోసమే, ప్యాకేజీతోనే పొత్తు కుదిరిందని ఆరోపిస్తున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సొంత కొడుకు నారా లోకేష్, తెలుగు దేశం పార్టీ నేతలపై నమ్మకంలేకే దత్త పుత్రుడు పవన్ తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. 2014లో ఎందుకు పొత్తు..? 2018లో ఒంటరిగా ఎందుకు ? మళ్లీ 2024లో ఎందుకు పొత్తు ..? సమాధానం చెప్పాలని నిలదీశారు ఎంపీ భరత్.. జనసైనికులకు, టీడీపీ నేతలకు.. ఇద్దరు నేతలు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
తప్పు చేస్తే జైలుకు వెళ్లాలి.. వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతారా..?
తప్పు చేస్తే జైలుకు వెళ్లాలి.. కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత కోర్టుల్లో ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్లపై స్పందిస్తూ.. గతంలో దేశంలో ఎంతోమందికి రాజకీయ నాయకులు శిక్ష విధిస్తూ తీర్పులు వచ్చాయి.. చట్టం ఎవరికీ చుట్టం కాదు.. కానీ, చంద్రబాబును హౌస్ రిమాండ్ కోసం పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు.. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు.. ఇంటికో ఉద్యోగం అన్నావు.. నిరుద్యోగులు డబ్బులు కాజేశావు అంటూ ఆరోపణలు గుప్పించారు తమ్మినేని.. రాష్ట్రాన్ని పాలించాల్సిన ముఖ్యమంత్రే అవినీతి చేస్తే ఇంకెక్కడ ఉంది న్యాయం..? అని నిలదీశారు.. సీఐడీ విచారణలో చంద్రబాబు అవినీతి బయటపడటంతోనే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. చంద్రబాబు 375 కోట్ల రూపాయల అవినీతి చేస్తే.. తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డుపై దీక్షలు, ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం..? అని ప్రశ్నించారు. రెండు ఎకరాల భూమి ఉన్న నువ్వు.. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించావో చెప్పండి బాబు? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
రీల్ లైఫ్.. రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది.. పవన్‌కి క్రెడిబులిటీ లేదు..!
టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ తాజా పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పొత్తులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు క్రెడిబులిటీ లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను టీడీపీ నేతలే ఓడిస్తారంటూ జోస్యం చెప్పారు.. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో పవన్ కల్యాణ్ చెప్పాలని నిలదీశారు.. గతంలో ఎందుకు విడిపోయారు.. ఇప్పుడెందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలని ప్రశ్నించారు. ఇక, ఓట్లు సంపాదించేందుకు ఎవరైనా రాజకీయ పార్టీలు పెడతారు.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ పెట్టానంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కు చాలా తేడా ఉందని పవన్ గుర్తించాలని సూచించారు.. మరోవైపు.. టీడీపీ – జనసేన పొత్తు వల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లను విమర్శించి ఇప్పుడు వారితోనే పొత్తు అనడం అవివేకం అని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు. అసలు పవన్ కల్యాణ్ బీజేపీతో సంప్రదించారో లేదో తెలియదని పేర్కొన్నారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
టీడీపీ-జనసేన పొత్తు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
టీడీపీ, జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగుతోంది.. పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు.. పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు వేసిన ఆమె.. జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు.. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు అంటూ మండిపడ్డారు. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు..? ముద్రగడకు ఎందుకు అండగా నిలబడలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్యాకేజ్ కోసమే ఇదంతా చేస్తున్నాడు.. సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్. వారు జన సైనికులు కాదు.. జెండాలు మోసే కూలీలు అంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే రోజా.. ఇక, సపోర్ట్ చేసే వారందరికీ స్కిల్ స్కాంలో వాటాలు ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. చంద్రబాబు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నాడు.. సీఐడీ చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షాతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా..? అని సూచించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు. ఇక, సినిమాలో మాత్రమే పవన్ హీరో.. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ లా మారాడు అని ఎద్దేవా చేశారు. సినీ పరిశ్రమలో నువ్వు ఉండడం సిగ్గు చేటు.. కళాకారులుగా మాకు అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పందులు గుంపులుగా వస్తాయని.. ఇవాళే పవన్ కల్యాణ్ అంగీకరించాడని దుయ్యబట్టారు మంత్రి ఆర్కే రోజా.
ఇది ములాఖత్ కాదు.. మిలాఖత్..! పవన్ సెటిల్‌మెంట్ కోసమే వెళ్లాడు..
జనసేన-టీడీపీ పొత్తులపై క్లారిటీ వచ్చేసింది.. సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జనసేన-టీడీపీ పొత్తుతో ముందుకు వెళ్తాయని ప్రకటించారు.. బీజేపీ కూడా కలిసివస్తే బాగుంటుందని పేర్కొన్నారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.. చంద్రబాబు తో పవన్ కు డీల్ కుదిరిందా? లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని.. క్రిమినల్ ప్రిజనర్‌తో ములాఖత్ కోసం పవన్ వస్తున్నారని చెప్పారు.. కానీ, ఇది ములాఖత్ కాదు.. మిలాఖత్ గా పేర్కొన్న ఆయన.. సెంటిమెంట్ ఓదార్పు కోసం వెళ్లాడనుకున్నా.. కానీ, సెటిల్‌మెంట్ కోసం పవన్ వెళ్లాడని ఆరోపణలు గుప్పించారు. పవన్ ఎప్పుడు క్లారిటీగా ఉన్నాడు.. బీజేపీకే క్లారిటీ లేదన్నారు పేర్ని నాని.. బీజేపీతో పవన్ పొత్తు ఎప్పుడూ ప్రస్తుతమే.. పూర్తిస్థాయిలో ఎప్పుడూ ఉండబోదన్నారు. జస్ట్ బీజేపీతో టెంపరరీ పొత్తు మాత్రమే అన్నారు. నిండు అమవాస్య రోజు పొత్తు ప్రకటన.. శుభ సూచికంగా అభివర్ణించారు. లోకేష్ టీడీపీకి మద్దతు ప్రకటిస్తే.. ఎలా ఉంటుందో పవన్ చెప్పింది కూడా అలాగే ఉందన్న ఆయన.. పవన్ టీడీపీలో అంతర్భాగం.. ఇది లోకానికి తెలుసన్నారు. పవన్ వైఖరి చావు పరామర్శకు వచ్చి.. పెళ్లికి లగ్గం పెట్టుకున్నట్టు ఉందన్నారు. చంద్రబాబుకు నాకు సైద్ధాంతిక విభేదాలు మాత్రమే అని పవన్ చెప్తున్నాడు.. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు అని మండిపడ్డారు. చంద్రబాబుతో కలవడానికి ఉన్న సిద్ధాంతం ఏంటి..? అని నిలదీశారు.
ఢిల్లీకి నారా లోకేష్.. విషయం ఇదేనా..?
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కాకరేపుతోంది.. చట్టం తన పని తాను చేసుకుపోతోందని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో స్కామ్‌కు పాల్పడ్డారు.. ఇవిగో ఆధారాలు అని చూపిస్తున్నారు. అయితే, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ.. దాని కోసం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు.. రాజమండ్రి నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ మీడియాతో మాట్లాడనున్నారట లోకేష్.. రాష్ట్రంలో పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించేందుకు లోకేష్ ఢిల్లీ టూర్‌గా తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుపై కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చించనున్నారని సమాచారం.. పార్లమెంటులో సైతం రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలను చర్చించేలా టీడీపీ వ్యూహం సిద్ధం చేసిందట.. చంద్రబాబు అరెస్టుపై లోక్ సభలో చర్చ కోసం పార్టీ ఎంపీలతో లోకేష్ మాట్లాడనున్నారట. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన నారా లోకేష్ వెంట.. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మరో ముగ్గురు కూడా ఉన్నారు.. చంద్రబాబు అరెస్టు, ఆ కేసుపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.. కేంద్ర పెద్దల అపాయింట్‌మెంటగ్ కోరారని.. అవకాశం లభిస్తే కలుస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి..
సనాతన్‌కు వ్యతిరేకంగా భారత కూటమి ముందుంది.. ప్రతిపక్షాలపై ప్రధాని విసుర్లు
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడంపై డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యపై కూడా ఆయన మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఈ భూమి శ్రీరాముడి జన్మస్థలమని ప్రధాని అన్నారు. ఇక్కడ కౌశల్య మాత యొక్క గొప్ప ఆలయం ఉందని మోడీ తెలిపారు. విపక్షాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఈ రోజు మన విశ్వాసం, మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర గురించి మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నానని తెలిపారు. మీరందరూ గత తొమ్మిదేళ్లుగా కేంద్రం నుండి దూరంగా ఉన్న వ్యక్తులు అని అన్నారు. నిరంతరం ఎన్నికలలో ఓడిపోతున్నారని.. వారు ఇప్పుడు మీ పట్ల చాలా ద్వేషంతో ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. వారు మీ గుర్తింపు, సంస్కృతికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచారని విమర్శించారు. ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు. మరోవైపు సనాతన ధర్మంపై ప్రధాని మాట్లాడుతూ.. రాముడు శబరిని తల్లిగా పిలిచి రేగు పండ్లను తిని ఆనందించడం సనాతన సంస్కృతి అని అన్నారు. శ్రీ రాముడు పడవ నడిపే వ్యక్తిని కౌగిలించుకుని ఆశీర్వదించడం, అతని కోసం వానర సైన్యం పోరాడడం సనాతన సంస్కృతి అని అన్నారు. సనాతన సంస్కృతి అంటే కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టుకకు కాకుండా అతని కర్మలకు ప్రాధాన్యతనిస్తుందని మోడీ తెలిపారు. సనాతన్‌కు వ్యతిరేకంగా భారత కూటమి ముందుందని పేర్కొన్నారు.
20 సంవత్సరాల క్రితం దొంగతనం.. ఎట్టకేలకు చిక్కాడు
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు. గణపతి విఠల్‌తో పాటు దొంగతనానికి పాల్పడ్డ మరో వ్యక్తి 2006లో మరణించాడు. అయితే గత వారం వాగూర్‌ను తిరిగి అరెస్టు చేసిన తర్వాత కోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. అతని వయస్సును పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని వారాల క్రితం విచారణలో ఉన్న పాత ఫైళ్లను పోలీసు బృందం పరిశీలించగా ఈ చోరీ ఉదంతం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో గేదెల చోరీ ఘటన చోటుచేసుకుంది. కర్నాటక పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని వివిధ గ్రామాల నుంచి వాగూర్ రెండు సార్లు పట్టుబడ్డాడు. 1965లో జంతువులను దొంగిలించినట్లు వాగూర్, కృష్ణ చందర్‌లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో వారిద్దరికీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన తర్వాత వారెంట్లు, సమన్లకు వారిద్దరూ స్పందించడం మానేశారు. అయితే వారుండే గ్రామంలో పోలీసులు వెతికినప్పటికీ.. వారి ఆచూకీ లభించలేదు.
ఇంతకీ.. ఏలియన్స్ ఉన్నాయా.. లేదా..? అనేదానిపై నాసా కీలక ప్రకటన
ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అనే అంశాలపై చాలా కాలంగా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేక పోయారు. ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెప్పారు. యూఎఫ్‌వోలను ఫ్లయింగ్ సాసర్లు అని కూడా పిలుస్తుంటారు. అయితే, వీటిపై అధ్యయనం చేసిన నాసా.. గ్రహాంతర వాసుల గురించి వివరించేందుకు రెడీ అయింది. అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనోమినాపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఓ స్వతంత్ర అధ్యయన టీమ్ సంవత్సరం నుంచి పరిశోధనలు చేసింది. యూఏపీనే యూఎఫ్‌వో, ఫ్లయింగ్ సాసర్లుగా అభివర్ణిస్తున్నారు. ఇక, 2022లో నాసా ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ టీమ్ ఏలియన్లపై నివేదికతో రెడీగా ఉంది. యూఎఫ్‌వోలను గ్రహాంతరవాసుల వ్యోమ నౌకలుగా చాలా మంది పిలుస్తుంటారు. ఇతర గ్రహాల నుంచి అప్పుడప్పుడు యూఎఫ్‌వోలు వచ్చి భూమిని సందర్శించి వెళ్తుంటాయని చెబుతుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశంలో గ్రహాంతరవాసులు పదే పదే కనపడేవని అమెరికాకు చెందిన పలువురు చెప్పారు. యూఎఫ్‌వోల గురించి యూఏపీ స్వతంత్ర అధ్యయన బృందం శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన చేసి.. రిపోర్ట్ రెడీ చేసింది. యూఎఫ్‌వోల గురించి వీలైనంత క్షుణ్ణంగా ఆ టీమ్ అధ్యయనం చేసింది.
రజినీ సినిమాలో రానా.. అదిరిపోయే కాంబో.. ?
జైలర్ సినిమా హిట్ తో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు పెంచేశాడు. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టి కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి.. జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమా అధికారికంగా ప్రకటించప్పటినుంచి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతూ వస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో రజినీ తో పాటు ఒక కుర్ర హీరో నటించే అవకాశం ఉందని.. కీలకమైన పాత్ర కావడంతో ఒక స్టార్ హీరోను మేకర్స్ అప్రోచ్ అవుతున్నారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే మొదట న్యాచురల్ స్టార్ నాని.. రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నాని కొట్టిపడేశాడు. ఇక దీని తరువాత శర్వానంద్ ఆ లక్కీ ఛాన్స్ పట్టేశాడని వార్తలు వినిపించాయి. ఆల్మోస్ట్ శర్వానే ఫిక్స్ అయ్యినట్లు కూడా టాక్ నడిచింది. ఇక ఇప్పుడు శర్వా ప్లేస్ లో రానా వచ్చాడని తెలుస్తోంది. అయితే రానా వచ్చింది శర్వా ప్లేస్ లోనా.. ? లేక సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడా.. ? లేక క్యామియోలో నటిస్తున్నాడా.. ? అనేది క్లారిటీ లేదు. రానాకు క్యామియోలు, సపోర్టింగ్ రోల్స్ చేయడం కొత్తేమి కాదు.. అందులోనూ పాన్ ఇండియా సినిమా.. రజినీకాంత్ సినిమా అంటే మాటలు కాదు.. దీంతో రానా సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రజినీ, రానా కాంబో నిజమైతే అదిరిపోతోంది అంటూ అభిమానులు చెప్పుకోసిస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.
కొవ్వుపట్టి.. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి.. పెళ్లి పెటాకులు లేకుండా..
గత కొన్ని రోజులుగా మాధవీలత పెళ్లి టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఏ వీడియో పెట్టినా.. అందరు పెళ్లెప్పుడు అని అడిగేవారు ఎక్కువ అయ్యారు. తాజాగా తన పెళ్లిపై ఒక నెటిజన్ ఘాటుగా మాట్లాడేసరికి అమ్మడు కూడా మరింత ఘాటుగా జవాబిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మాట్లాడింది. పెళ్లిపెటాకులు లేక కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నావ్ అంటున్నాడు.. అందుకే వాడికి సమాధానం చెప్తున్నా అంటూ వీడియో మొదలుపెట్టింది. “మీరందరు ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలి.. అయితే మీరు నాకు పెళ్లి చేయండి.. పెళ్లి చేయండి నాకు.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారా.. ? మోడీ, యోగి, వివేకానంద, అబ్దుల్ కలామ్ వీరెవ్వరు పెళ్లి చేసుకోలేదు.. అయినా భూమి మీద బతకలేదా.. ? పెళ్లి చేసుకోకపోతే అదో పెద్ద నేరమా.. ? పెళ్లి చేసుకోకపోతే సిగ్గుసేరం లేనట్టు.. ఇప్పుడు.. పెళ్లి చేసుకోకపోతే కొవ్వుపట్టినట్టు.. బలుపు ఎక్కినట్లు.. అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నట్లు.. లైఫ్ మీద క్లారిటీ లేనట్లు.. అందుకే పెళ్లి చేసుకొన్నట్లు చెప్తున్నారు. పోనీ పెళ్లి చేసుకొంటే.. వద్దురా నాయనా.. అని మొగుడు పెళ్ళాన్ని అనడం .. పెళ్ళాం మొగుడు ను అనడం.. పెళ్లి చేసుకోనోళ్లు పచ్చి తిరుగుబోతులు అన్నట్లు చెప్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టీఆర్పీ రికార్డులు బద్దలు కొట్టిన బిగ్ బాస్ 7 కర్టెన్ రైజర్..ఎంత వచ్చిందటే?
బిగ్ బాస్ మొదలైన ప్రతిసారి ఇదేమి షో? ఇలాంటి షోలు ఎవడు చూస్తాడు అనే కామెంట్స్ కామన్. అంతేకాదు ఈ కంటెస్టెంట్స్ ఎవర్రా బాబూ ఎక్కడ్నుంచి ఎత్తుకొచ్చిన సంత రా ఇది, తెలిసిన ముఖాలే లేవు అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే బిగ్ బాస్‌కి ఉన్న సెలెక్టెడ్ ఆడియన్స్ ఎక్కడికీ పోరు, మిగతా వాళ్ళు ఎవరు చూసినా చూడకపోయినా వాళ్లు మాత్రం బిగ్ బాస్‌ని ఫాలో అవుతూనే ఉంటారని చెప్పకతప్పదు. సీజన్ ఏదైనా సరే తొలి ఐదువారాలు బిగ్ బాస్ షో ప్రభావం పెద్దగా ఉండదు. ఆరో వారం తరువాత నుంచి జనాలు తగ్గిన తరువాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒకవేళ అందులో కంటెస్టెంట్స్ మెరుగైన ప్రదర్శన ఇస్తే ఇంకా చెప్పాల్సిన పనేలేదు. సీజన్ 1 మినహాయిస్తే మిగిలిన సీజన్లకి ఇదే విధమైన టీఆర్పీ ఇబ్బందులు ఫేస్ చేశారు. అయితే అన్ని సీజన్ల కంటే భిన్నంగా ఈ ఏడవ సీజన్ సాగుతుంది. సీజన్ హిట్టా.. ఫట్టా అని తేల్చేది లాఛింగ్ ఎపిసోడ్‌తోనే అయితే ఆరో సీజన్ అన్ని సీజన్లకంటే ఘోరమైన రేటింగ్‌ని సాధించి బిగ్ బాస్ హిస్టరీలోనే పరమ చెత్త రికార్డ్ క్రియేట్ చేయగా ఇప్పుడు మాత్రం ఏడవ సీజన్ రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌కి 16.18 నాని హెస్ట్ చేసిన రెండో సీజన్ 15.05, ఆ తరువాత నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తున్నాయి. మూడో సీజన్ 17.9.. నాలుగో సీజన్ 18.5.. ఐదో సీజన్ 18 రేటింగ్ సాధించగా ఆరో సీజన్ 8.86 రేటింగ్ సాధించడంతో అన్ని సీజన్లకంటే ది వరస్ట్ సీజన్ ఇదే అయ్యింది. ఇక ఈసారి మాత్రం 18.1 సాధించింది అంటూ స్టార్ మా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది, ఇది గతంలో కంటే తక్కువే అయినా రికార్డు అని పేర్కొనడం గమనార్హం.