Homeతెలుగు రాష్ట్రాలుTop Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌


Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌..
అరకు పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ఆంధ్రా ఊటీ అరకు అందాలను ఆకాశంలో నుంచి చూస్తే ఎలా వుంటుంది..!?. ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి అరకు వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి వచ్చింది. అరకు హిల్స్ & వ్యాలీ సోయగాలను, మంచు తెరలను వందల అడుగుల ఎత్తు నుంచి చూసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా ట్రైల్ రన్ నిర్వహించిన నిర్వాహకులు… ఇవాళ్టి నుంచి రెగ్యులర్ గా అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పద్మాపురం గార్డెన్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో ప్రారంభం అవుతుంది. అయితే, గతంలో అరకు ప్రమోషన్ కోసం హాట్ ఎయిర్ బెలూన్ షో నిర్వహించిన అది ప్రొఫెషనల్ కోసమే జరిగింది. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి రాగా అద్వంచర్ థ్రిల్ ఎంజాయ్ చేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు పర్యాటకలు.

ప్రేమోన్మాది చేతిలో బాలిక హత్య.. కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్..
బద్వేల్ పట్టణంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌.. బద్వేల్ పట్టణంలో హత్యకు గురైన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి.. ధైర్యాన్ని చెప్పనున్నారు.. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయనగర్ లో ఉన్న బాధిత బాలిక కుటుంబ సభ్యులను కలిసి.. వారిని ఓదార్చ నున్నారు. గుంటూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బద్వేల్ చేరుకోనున్న జగన్‌.. బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన పులివెందులకు చేరుకుని రాత్రికి పులివెందులలో బస చేయనున్నారు.

కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. మీసాలు, గడ్డాలు తీయాల్సిందే..!
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. తరగతులు ప్రారంభమై వారం గడవక ముందే జూనియర్లకు ర్యాగింగ్ వేధింపులు మొదలయ్యాయి. మీసాలు, గడ్డాలు తీసేసుకోవాలని సీనియర్ల హుకుం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లజోడు కూడా తాము చెప్పిన వాటినే పెట్టుకోవాలని, ఆకడమిక్ ఆన్ లైన్ యాప్ లు తాము చెప్పినవి తీసుకోవాలని సమాచారం. తరగతులు అయిన వెంటనే గుంపులు గుంపులుగా వెళ్లి క్యాంపస్ లోనే జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజుల క్రితమే కాలేజీలో ర్యాగింగ్ పై ప్రిన్సిపాల్ యాంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించగా ఎస్పీ కూడా హాజరయ్యారు. ర్యాగింగ్ నేరమని, ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. గత ఏడాది కూడా ర్యాగింగ్ తో విద్యార్థుల పేరెంట్స్ యూజీసీకి ఫిర్యాదు చేశారు. కమిటీ నియమించి విచారించినా ఎవరిపైనా ఎవరిపైనా చర్యలు తీసుకోని ఫలితంగా ఈ ఏడాది మళ్లీ విద్యార్థులకు ర్యాగింగ్ తప్పడం లేదు. గత ఏడాది మెడికల్ కాలేజీ మేన్స్ హాస్టల్ లో గంజాయి కూడా లభ్యమైంది. మెడికల్ కాలేజీ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. అయితే, ర్యాగింగ్ జరిగినట్లు ఫిర్యాదు రాలేదన్నారు ప్రిన్సిపాల్ చిట్టి నర్సమ్మ.. హాస్టల్ కి వెళ్లి కొత్త విద్యార్థులతో మాట్లాడానని, ర్యాగింగ్ జరిగినట్లు విద్యార్థులు చెప్పలేదనన్నారు ప్రిన్సిపాల్. చెప్పడానికి విద్యార్థులకు భయం ఉంటే తనకు వాట్సాప్ లో , ఫోన్ చేసి అయినా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు ప్రిన్సిపాల్.

దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం అయ్యింది.. మంగళగిరిలో డ్రోన్-2024 సమ్మిట్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీలో భారత్‌ దూసుకుపోతోందన్నారు.. అమెరికాలో ఉన్న కార్పొరేట్ సంస్ధలను కలిశాను.. ఇండియా టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉంది.. ఇండియాలో మాత్రమే అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడే వారున్నారు.. జీరో కనుగొన్నది ఇండియన్స్, ఇంగ్లీషు మాట్లాడే అధికులు ఇండియన్స్ అని బిల్ గేట్స్ కు చెప్పి ఒప్పించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు తెచ్చాను అని గుర్తుచేసుకున్నారు. ఇలాంటి ఒక డ్రోన్ సమ్మిట్ చాలా మంచిది.. ఇది ఒక మార్పు తీసుకొస్తుందన్నారు.. మనకు అడ్వాన్స్‌డ్ డ్రోన్స్, సీసీ కెమెరాలు, ఇతర ఐఓటీ పరికరాలు ఉన్నాయన్నారు. జాబ్ అడిగే వారు కావద్దు.. జాబ్స్ ఇచ్చే వారిగా మారాలన్నారు సీఎం చంద్రబాబు.. ఇక, తెలుగు కమ్యూనిటీ నుంచే 30 శాతం మంది జాబ్స్ ఇచ్చే వారుగా ఉన్నారన్న ఆయన.. ఎమిరేట్స్ నుంచి మొదటి ఫ్లైట్ హైదరాబాద్‌కు తెచ్చాం.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం అప్పటి ప్రధాని వాజ్ పేయిని ఒప్పించాను అన్నారు..

కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్.. దండుపాళ్యం గ్యాంగ్గా మారింది..
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తిడుతున్నాడు అంటే.. మీ కథలు అట్లున్నాయి.. కాబట్టి తిడతాడని అన్నారు. కేటీఆర్ బ్రాయిలర్ కోడి వ్యవహారం.. మేము నాటు కోడి టైపు.. నాజూకుగా పెరిగిన కేటీఆర్ లెక్క అయ్య పేరు చెప్పుకొని సీఎం కాలేదు రేవంత్ అని చెప్పారు. రేవంత్ కి ఫుట్ పాత్ నుంచి తెలుసు.. నేను కూడా ఫుట్ పాత్ నుంచి వచ్చానని తెలిపారు. నీకు అవన్నీ తెలియకుండా పెంచాడు కేసీఆర్.. కేటీఆర్ ఎలా తిట్టాలో రేవంత్ దగ్గరే ట్రైనింగ్ తీసుకో అని ఆయన సూచించారు. రేవంత్ కి చెప్తా.. అర గంట, గంట టైం ఇవ్వమని.. అలాగే, దామగుండంనీ నేవీ ఎందుకు ఎంచుకుందో తెలుసా?.. రాడార్ వ్యవస్థ లో 1000 కిలోమీటర్లలో ఉన్న సిగ్నల్ అందిస్తుంది.. సముద్ర మట్టానికి ఎత్తులో దామగుండం ఉంది కాబట్టి రాడార్ పెట్టారు.. ఇవన్నీ కేటీఆర్ కి తెలియదు.. అంతా బుక్ నాలెడ్జి అని జగ్గారెడ్డి మండిపడ్డారు.

జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు
జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది. ఇప్పుడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు లోబడే మార్పులు చేర్పులు జరుగుతాయి. బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను ఎంపిక చేశారు. బూత్ కమిటీల నుంచి ప్రారంభం చేసి రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి ఎన్నికలను నిర్వహించనున్నారు. పార్టీ కొత్త కమిటీల ఎన్నికల్లో క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర. మూడు నెలల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కమలం పార్టీ.. పది కోట్ల మంది ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.. అంతర్గత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయి. బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నికల ప్రక్రియ జరగనుంది.. ప్రాథమిక సభ్యత్వాలు పూర్తి చేసుకుని క్రియాశీలక సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. బూత్ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.. దేశవ్యాప్తంగా 10 లక్షల బూతులకు ఎన్నిక జరగనుంది అన్నారు. ప్రతి బూతు కమిటీలో అధ్యక్షుడితో పాటు 11 మంది సభ్యులు ఉంటారు. అన్ని రాష్ట్రాల రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తైంది.. ఒక సామాన్య కార్యకర్తగా వచ్చిన నన్ను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నాను అని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

ధరణి పోర్టల్‌ నిర్వహణ ఎన్‌ఐసీకి అప్పగించిన తెలంగాణ సర్కార్
ధరణి పోర్టల్ లోని భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు బాధ్యతలు పర్యవేక్షించిన ప్రైవేటు కంపెనీ క్వాంటెలాను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతోనే ఈ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను పొడిగిస్తూ వచ్చింది రెవెన్యూ శాఖ. రేవంత్ రెడ్డి సీఎం కాగానే ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, టీజీటీఎస్‌ ఎండీతో పాటు పలువురు ఐఏఎస్‌లతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి నిర్వహణను ఎన్‌ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు అప్పగించే విషయమై అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోర్టల్‌ నిర్వహణను తక్కువ వ్యయంతోనే చేపట్టడానికి ఎన్‌ఐసీ ముందుకు రావడంతో చివరికి దాని వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్లు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీ చూడనుంది.

ఓపెన్ ఆఫర్.. లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన వారికి భారీ రివార్డ్ ప్రకటించిన కర్ణిసేన
క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసినందుకు అతను కోటి రూపాయలకు పైగా రివార్డును ప్రకటించాడు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రూ.1,11,11,111 రివార్డు ఇస్తామని చెప్పారు. సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య లారెన్స్ బిష్ణోయ్ ద్వారా జరిగిందని ఆయన వీడియోలో తెలిపారు. అలాగే మనకు, దేశప్రజలకు భయం లేని భారతదేశం కావాలి, భయంకరమైనది కాదని తెలిపారు. నిజానికి సోషల్ మీడియాలో గోగమేడి హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ బాధ్యత వహించాడు. గోగమేడిని రెండు మూడు సార్లు హెచ్చరించినా వినలేదని అన్నారు. అందుకే కాల్చానని తెలిపాడు. ఇకపోతే, క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ఓ వీడియోను విడుదల చేసి ఎన్‌కౌంటర్‌కు రివార్డు ప్రకటించారు. ఈ వీడియోలో, లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు సిబ్బందికి రూ.1,11,11,111 (కోటి పదకొండు లక్షల పదకొండు వేల పదకొండు వందల పదకొండు) ఇస్తానని రాజ్ షెకావత్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. మన క్షత్రియ కర్ణి అమూల్యమైన రత్నం, వారసత్వ అమరవీరుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపినా వారిని కారకులైన వారిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు సేన ఈ మొత్తాన్ని అందజేస్తుందని తెలిపారు. అలాగే ఆ ధైర్యవంతుడైన పోలీసు కుటుంబానికి భద్రత, పూర్తి ఏర్పాట్లకు కూడా మేము బాధ్యత వహిస్తామని చెప్పుకొచ్చారు.

16 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష విరమణ
హోం మంత్రిత్వ శాఖ హామీ మేరకు సోనమ్ వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. తాజాగా ఆయనని జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ లోఖండేను కలుసుకున్నాడు. లడఖ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ అత్యున్నత కమిటీ హోం మంత్రిత్వ శాఖ నుండి ఒక లేఖను అతనికి అందజేసింది. ఆయనతో తదుపరి సమావేశం డిసెంబర్ 3న జరగనుంది. దీని తరువాత వాంగ్‌చుక్, అతని మద్దతుదారులు తమ నిరాహార దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నారు. దహో ఆయన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఈ సంబంధించి నిరాహార దీక్ష 16వ రోజున మా విజ్ఞప్తికి పరిష్కారం లభించినందుకు సంతోషంగా ఉందని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ఇప్పుడు, హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఇక్కడికి లడఖ్ భవన్‌కు వచ్చి సంభాషణను ప్రస్తావిస్తూ ఈ లేఖను నాకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వంతో కార్గిల్‌లో లేహ్ అపెక్స్ బాడీ, కెడిఎ మధ్య కొనసాగుతున్న చర్చలు త్వరలో డిసెంబర్ నాటికి తిరిగి ప్రారంభమవుతాయని వాంగ్‌చుక్ తెలిపారు. మంత్రిత్వ శాఖ, లడఖ్‌ లోని రెండు ప్రాంతాలు లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు చెందిన రెండు సామాజిక రాజకీయ సంస్థల మధ్య చర్చల ఫలితాలు సానుకూలంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇన్వెస్టర్లకు షాక్.. ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్‭లోకి ఎంట్రీ
భారతదేశపు అతిపెద్ద ఐపిఓ రూ.27,870 కోట్ల ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ స్టాక్ మార్కెట్‌లో నిరుత్సాహకర లిస్టింగ్‌తో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ ఈ రోజు (అక్టోబర్ 22) న దేశీయ మార్కెట్లో నష్టాలతో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో నష్టాలలో ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ షేర్ ధర అంచనా కంటే తక్కువతో లిస్టింగ్ అయ్యింది. ప్రారంభమైన తర్వాత కూడా స్టాక్ దాదాపు 3% కంటే ఎక్కువ పడిపోయింది. ఈ ఐపిఓకు 2.37 శాతం సబ్‌స్క్రైబ్ చేయబడింది. దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ భారతీయ ఆర్మ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ రోజు ఉదయం 10 గంటలకు హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు ఒక్కో షేరుకు రూ. 1,931 గా లిస్ట్ అయ్యింది. దాని ఇష్యూ ధర నుండి 1.5% తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి. ఈ షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ.1,931 స్థాయిలో లిస్ట్ కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఒక్కో షేరు ధర రూ.1,934గా నమోదైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆటో రంగంలో ఐపీఓ వచ్చింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ యొక్క ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.1,934.

పృథ్వీ షాపై వేటు.. ఇక కెరీర్‌ క్లోజ్ అయినట్టే?
టీమిండియా క్రికెటర్‌ పృథ్వీ షాకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే భారత జట్టుకు దూరమైన అతడు.. తాజాగా రంజీ ట్రోఫీ జట్టులోనూ స్థానం కోల్పోయాడు. ముంబై రంజీ టీమ్‌లోకి పృథ్వీ షాను ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో అఖిల్ హెర్వాడ్కర్‌ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. పృథ్వీ షా పక్కనపెట్టడానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ స్పష్టమైన కారణం చెప్పలేదు కానీ.. ఫామ్, ఫిట్‌నెస్‌, క్రమశిక్షణారాహిత్యం కారణంగానే వేటు వేసినట్లు తెలుస్తోంది. పృథ్వీ షా ఫామ్ ప్రస్తుతం ఏమాత్రం బాగాలేదు. క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోతున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ అంతంత మాత్రంగానే ఉంది. షా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక నెట్‌ సెషన్స్‌కు ఆలస్యంగా రావడంతో పాటు కొన్నిసార్లు డుమ్మా కొడుతున్నాడట. నెట్‌ సెషన్స్‌ను అస్సలు సీరియస్‌గా తీసుకోవట్లేదని సమాచారం. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్లు అతడిపై వేటు వేశారట. పృథ్వీ షాని జట్టు నుంచి తప్పించడాన్ని కెప్టెన్, కోచ్‌ కూడా సమర్థించినట్లు తెలుస్తోంది.

మామ అల్లుళ్లను కలుపుతున్న జైలర్ 2 డైరెక్టర్
ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్. ‘జైలర్’ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెల్సన్ పాపులర్ అయ్యాడు. ‘జైలర్’ మెగా బాక్సాఫీస్ విజయాన్ని అందించడంతో ‘ జైలర్ 2 ‘ కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. సీక్వెల్‌లో పని చేస్తున్నట్లు అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం రజనీకాంత్ తో పాటు ధనుష్‌ని తీసుకురావడానికి నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకే సినిమా కోసం మామ అల్లుళ్లను క‌లిపే వ్యూహాన్ని నెల్సన్ అనుస‌రిస్తున్నాడ‌ట‌. ‘జైలర్’లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ల లాంటి దిగ్గజాలు గెస్ట్ రోల్స్ పోషించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ లోను వారిని న‌టింప‌జేయాల‌ని అనుకుంటున్నారట. వారితో పాటు ధనుష్ కోసం ఒక పాత్రను సిద్ధం చేశార‌ని తెలిసింది. ఇప్పటికే ధ‌నుష్ ఎంపిక విష‌య‌మై రజనీకాంత్ నుండి అనుమతి పొందినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన‌ రజనీకాంత్ -ధనుష్ ని ఒకే ఫ్రేమ్ లో వెండితెర మీద వీక్షించేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. అయితే ధనుష్ తన బిజీ షెడ్యూళ్ల మధ్య ‘జైలర్ 2’ షూటింగ్ కోసం డేట్ ఇస్తాడో లేదో చూడాలి. ధనుష్ అల్లుడు అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వీరాభిమాని. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో ఇటీవల అభిమానులతో కలిసి ‘వెట్టయన్’ సినిమాను వీక్షించి ఆనందం వెలిబుచ్చాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ‘జైలర్ 2’ ముహూర్తపు పూజకు ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌లో మాజీ భర్త ధనుష్‌తో ఐశ్చర్య క‌లుస్తార‌ని కూడా అనుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత ‘జైలర్ 2’ సెట్స్ పైకి వెళుతుంద‌ని సమాచారం. కొన్ని వారాల క్రితమే రజనీకాంత్‌కి శస్త్ర చికిత్స జరగడంతో ‘కూలీ’ షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఆయన పనిని తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది. కూలీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి ర‌జ‌నీ త‌దుప‌రి జైల‌ర్ 2లో న‌టించే అవ‌కాశం ఉంది.

పెరిగిన నాని రేంజ్.. మళ్లీ రెమ్యునరేషన్ హైక్ ?
ప్రస్తుతం నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ తో జోరు మీద ఉన్నాడు. ఈ సినిమా అతడికి హ్యాట్రిక్ హిట్ అందించింది. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు నాని. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ హౌసులో శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండడం విశేషం. పాన్ ఇండియా రేంజ్ లో నాని కెరియర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీని తర్వాత దసరా వంటి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో దర్శకత్వంలో నాని రెండో సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో మూవీ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని తర్వాత క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా నాని ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలతో నాని డైరీ ఫుల్ గా ఉంది. ఇదిలా ఉంటే వరుస విజయాలతో నాని మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. ప్రస్తుతం 60 నుంచి 80 కోట్ల మధ్యలో ఆయనపై బిజినెస్ నడుస్తోంది. దీంతోపాటు డిజిటల్ మార్కెట్ కూడా నాని సినిమాలకు బాగా పెరిగింది. ఆయన సినిమాలు మంచి ప్రీమియం ధరలకు ఓటీటీ ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నానితో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ముందుకొస్తున్నారు. పెరిగిన మార్కెట్ నేపథ్యంలో నాని తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచినట్లు టాక్ వినపడుతుంది. ‘హిట్ 3’ తర్వాత చేయబోయే సినిమాలకి నాని రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం టైర్ టు హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ గా నాని ఉన్నాడు. నిర్మాతలు కూడా నాని డిమాండ్ చేసింత ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. హిట్ 3 మూవీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకుంటే నాని టైర్ వన్ హీరోల జాబితాలోకి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతలు కూడా 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి వెనుకాడకపోవచ్చని అంతా అనుకుంటున్నారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments