Son Killed Mother: ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు దారుణంగా హతమర్చాడు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కంబదూరు మండలం ఎగువపల్లిలో తల్లిని సుత్తితో కొట్టి తనయుడు హతమార్చాడు.
తల్లి వైసీపీకి ఓటు వేయడంతో విచక్షణ మరిచిన కొడుకు కన్న తల్లినే సుత్తితో కొట్టి చంపేశాడు. ఓటు వేసినందుకు తల్లితో గొడవ పెట్టుకున్న తనయుడు మద్యం మత్తులో హత్య చేసి పరారయ్యాడు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డే వెంకటేశులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నాడు. వెంకటేశులు తల్లి సుంకమ్మ సోమవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేసినట్టు కొడుకుతో చెప్పింది. కోపంతో ఊగిపోయిన తనయుడు తల్లిని తీవ్రంగా దూషించాడు.
ఆ తర్వాత మద్యం సేవించి ఇంటికి వచ్చి మళ్లీ తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లిపై దాడి చేశాడు. సుంకమ్మ తలపై ఇనుప సుత్తితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కొడుకే హత్య చేశాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కంబదూరు పోలీసులు హత్య ప్రాంతానికి చేరుకొని కేసునమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.