Revanth Reddy: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర ఆక్రమించిన భూములు ఉండొచ్చు, అక్రమ సంపాదన ఉండొచ్చు కానీ ప్రజా మద్దతు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌కి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో పటాన్‌చెరులో బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, వాళ్ల ఆగడాలు మీకు తెలుసని, మీరు ఓటేసి గెలిపిస్తే మీ భూముల్ని గుంజుకున్నరు, వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఓటుకు పదివేలు ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు.
Read Also: CM KCR: దుబ్బాకలో ఎప్పుడైనా కత్తిపోట్లు చూశామా..? మనకు కత్తులు దొరకవా..?
ఆనాడు ఇందిరమ్మ హయాంలో ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చేశామని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం నమ్మకద్రోహం చేసిన కుటుంబమని, తెలంగాణను దోచుకున్న కుటుంబం, తెలంగాణకు ద్రోహం చేసిన కుటుంబమని ఆరోపించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఈ పటాన్ చెరులో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యే మహిపాలుడు కాదు, శిశుపాలుడని, వంద తప్పులు చేసిన శిశుపాలుడి తల నరికినట్లే, వంద తప్పులు చేసిన మహిపాలుడిని పటాన్ చెరులో బొంద పెటాలని అన్నారు. పటాన్ చెరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండా అని ధీమా వ్యక్తం చేశారు.