Razakar The Silent Genocide of Hyderabad Review in Telugu: బిజెపి నేత గూడూరు నారాయణరెడ్డి నిర్మాతగా సీరియల్స్ డైరెక్టర్ యాట సత్యనారాయణ దర్శకత్వంలో రజాకర్ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. అనేక మంది ఈ సినిమాని తెరకెక్కించకుండా చూడాలంటూ కోర్టుల వరకు వెళ్లడంతో అసలు ఏమిటి ఈ సినిమా అని మరి కొంతమంది తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా అనేక వాయిదాలు అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ‘రజాకార్’ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
రజాకార్ కథ ఏమిటంటే:
భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948లో వచ్చింది. ఇప్పుడున్న తెలంగాణ, కర్ణాటకలోని బీదర్ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను కలిపి నిజాం రాష్ట్రంగా నిజాం వంశస్థులు పాలిస్తూ వచ్చేవారు. బ్రిటిష్ వాళ్లు 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతున్న సమయంలో నిజాం రాష్ట్రాన్ని మాత్రం వారికి ఇష్టం వచ్చిన వారితో కలవచ్చని చెబుతారు. అయితే అప్పటి నిజాం రాజు(మకరంద దేశ్పాండే)కు నిజం సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపడం ఇష్టం లేదు. అలా అని భారతదేశంలో కలపడం కూడా ఇష్టం లేదు. తమ దగ్గర ఉన్న రజాకార్లు అనే ప్రైవేటు సైన్యంతో నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ గా ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటాడు. అందుకు రజాకారుల చీఫ్ ఖాసిం రిజ్వి( రాజ్ అర్జున్), మంత్రి(జాన్ విజయ్)లు దుర్మార్గానికి దిగుతారు. నిజాం రాష్ట్రంలో బతకాలంటే మతం మార్చుకోవాలి, లేదంటే బానిసలుగా ట్రీట్ చేస్తామని చెబుతూ అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉంటారు. మరో పక్క భారతదేశ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ (రాజ్ సప్రు) ఈ దురాగతాలను తెలుసుకొని ఎలా అయినా భారత దేశంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి తిరుగు బాట్లు ఏర్పడ్డాయి? ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు? తిరుగుబాటు చేస్తున్న వారిని రజాకార్లు ఎలా అణగదొక్కే ప్రయత్నం చేశారు? చివరికి విలీనానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి? లాంటి విషయాలు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
నిజాం పాలనలో రజాకారుల అరాచకాలు గురించి ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు పెద్దలందరికీ ఈ వ్యవహారం అంతా బాగా తెలుసు. ఒక రకంగా చరిత్రపుటల్లో ఉన్న అంశాన్ని ఇప్పటి తరానికి అందించాలని ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. నిజానికి నిజాం పాలనలో ఒకప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే విషయం బహుశా ఈ సినిమా చూసే వరకు ఈ తరం వారికి తెలియదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పుస్తక పఠనం అలవాటు ఉన్నవారు ఒకప్పటి తెలంగాణ సాయుధ పోరాట అంశాలు ఉన్న పుస్తకాలు చదివితే తప్ప ఈ అంశాలు ఏవి వారికి తెలియవు. కానీ ఒకప్పుడు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరిగింది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పుడు నిర్మాత బీజేపీ వ్యక్తి కావడంతో కావాలని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా సినిమా చేస్తున్నారేమో అని అందరిలోనూ ఒక అనుమానం ఉంది. దానికి తోడు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు కానీ స్టార్ కాస్ట్ లేకపోవడం, దర్శకుడు కూడా స్టార్ డైరెక్టర్ కాకుండా ఒక సీరియల్ డైరెక్టర్ ని పెట్టుకోవడంతో సినిమా మీద ప్రేక్షకులలో ఒక స్థాయి వరకు మాత్రమే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ అనేక గూస్ బంప్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను స్వీట్ షాక్ కి గురిచేస్తుంది ఈ మూవీ. ఇది ప్రాపగాండా ఫిలిం అయి ఉండవచ్చని సినిమా చూసేవరకు అందరిలోనూ ఒక అభిప్రాయం ఉంటుంది కానీ చరిత్రలో ఏవైతే విషయాలు ఉన్నాయో అవే విషయాలకు ఒక దృశ్య రూపకంగా ఈ సినిమా నిలుస్తుంది. రజాకారుల దుశ్చర్యలకు అప్పటి నిజాం ప్రజలు ఎలా అల్లాడిపోయారు? బిడ్డ పుడితే పన్ను, చనిపోతే పన్ను అంటూ ఎలా వేధించేవారు? అప్పుడే పుష్పవతి అయిన ఆడపిల్లల మీద రజాకారులు, వాళ్ల ప్రతినిధులు ఎలా అఘాయిత్యాలకు పాల్పడేవారు వంటి విషయాలు చూస్తున్న సమయంలో నిజంగా రజాకార్లు కనిపిస్తే వాళ్ల మీద మనమే తిరుగుబాటు చేసేయాలి అనేంతలా కొన్ని సీన్స్ కళ్ళకు కట్టినట్లు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఏ ఒక్కరిని హీరో అనలేము, ఎందుకంటే ప్రతి 20 నిమిషాలు లేదా అరగంటకి ఒక పాత్ర తెరమీదకు వచ్చి చేసే మ్యాజిక్ ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలలో నటీనటులు కనిపించరు కేవలం పాత్రలే కనిపిస్తాయి. అంతలా ఒక్కొక్క పాత్ర తెరమీదకు వచ్చి చేసే వీరంగం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంకా కత్తి మీద సాము లాంటి విషయం ఏమిటంటే ఇది స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి కాబట్టి అప్పటి ఊర్లను, అప్పటి సెటప్ ని ప్రత్యేకంగా సృష్టించాల్సి ఉంది. ఆ విషయంలో సినిమా యూనిట్ బాగా సక్సెస్ అయింది. డ్రెస్సులు మొదలు లుక్స్, ఇళ్లు, వాహనాలు వంటి వాటిని క్రియేట్ చేయటం చాలా కష్టమైన విషయం. అలాగే క్రౌడ్ ని క్యాప్చర్ చేసే విషయంలో కూడా భలే ఆసక్తికరంగా విఎఫ్ఎక్స్ చేశారు. సినిమా మేకింగ్ విషయంలో సూపర్బ్ అనే చెప్పాలి కానీ కథ విషయంలోనే కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో సాయుధ పోరాటాన్ని చాలా వరకు కమ్యూనిస్టులు భుజం స్కందాల మీద వేసుకుని నడిపించారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకో వారిని పక్కన పెట్టినట్లు అనిపించింది. చివరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రతో కొంత దాన్ని కవర్ చేయించే ప్రయత్నం చేసినా సరే కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది వారిని పక్కన పెట్టడం కొంత సహేతుకం అనిపించలేదు.
నటీనటుల విషయానికి వస్తే సినిమాలో చాలామంది నటీనట్లు తమ కెరియర్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని చెప్పక తప్పదు. రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, నిజాం భార్యగా అనుష్య త్రిపాఠి, ప్రేమ, చాకలి ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మగా అనసూయ భరద్వాజ్, నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గా రాజ్ సప్రు, కాసిం రిజ్విగా రాజ్ అర్జున్, నిజాం మంత్రిగా జాన్ విజయ్, యాట సత్యనారాయణ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలలో ఇమిడిపోవడమే కాదు తమ స్థానంలో వేరేవరు బాగా నటించలేరేమో అనేంతలా నటించారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సీరియల్ డైరెక్టర్ ఆట సత్యనారాయణ ఒక సరికొత్త తెలుగు సినీ దర్శకుడిగా మొదటి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మేకింగ్ పరంగా సినిమా ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా కొన్ని పాటలు గూస్ బంప్స్ తెప్పించడమే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా గూస్ బంప్స్ తెప్పించే ప్రయత్నం చేశారు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా కుదిరింది. సినిమా మొత్తం మీద ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనబడింది. నిడివి రెండు గంటల 36 నిమిషాల పాటు ఉన్న ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజింగ్ గా చేయడంలో ఎడిటర్ కూడా సక్సెస్ అయ్యాడు.
ఫైనల్ గా రజాకార్ మూవీ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ప్రాపగాండా ఫిలిం అనే అనుమానాలు లేకుండా మేకింగ్ కోసం సినిమా లవర్స్ చూడాల్సిన సినిమా ఇది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కోసం తపించే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.