పవన్ విమానానికి నో పర్మిషన్
పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానం టేకాఫ్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి పవన్ కల్యాణ్ సిద్ధమవ్వగా, ఆయన ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానాన్ని టేకాఫ్ కాకుండా పోలీసులు అడ్డుకున్నారని జనసేన ఆరోపించింది. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం కోసం పవన్ శనివారం సాయంత్రం విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. అయితే పవన్ కల్యాణ్ ను బేగంపేట ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ విమానానికి అనుమతి ఇవ్వొద్దని గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులకు కృష్ణా జిల్లా ఎస్పీ లేఖ రాశారు. విజయవాడలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులు కారణంగా పవన్ కల్యాణ్ విమానానికి అనుమతి నిరాకరించాలని అధికారులకు సూచించారు. పవన్ కల్యాణ్ వస్తే భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ వస్తారని, దీంతో ఇతర ప్యాసింజర్లకు అసౌర్యం కలుగుతోందని తెలిపారు. దీంతో పవన్ విమానానికి ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ రోడ్డు మార్గంలో విజయవాడు బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పవన్ ను గరికపాడు వద్ద అడ్డుకున్నారు.