- వెలగపూడిలో మహిళ హత్య కేసు
- నందిగం సురేష్‌కు 14 రోజుల రిమాండ్
- గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
Nandigam Suresh Remand: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు షాక్ తగిలింది. మంగళగిరి కోర్టు ఆయనకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. మరియమ్మ హత్య కేసులో ఆయనకు కస్టడీ ముగియగా.. పోలీసులు ఈరోజు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు మరింత సమయం కావాలని పోలీసులు కోరడంతో.. నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం నందిగం సురేష్‌ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించింది. అప్పటి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలంతోనే గొడవ జరిగిందని మరియమ్మ బంధువులు ఆరోపించారు. మరియమ్మ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నందిగం సురేష్ పేరును కూడా కేసులో చేర్చారు. కేసులో ఆయన 78వ నిందితుడిగా ఉన్నారు. అధికార పార్టీ ఎంపీ కావడంతో విచారణ ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తమకు న్యాయం చేయాలని తుళ్లూరు పాలీసులను మరియమ్మ బంధువులు ఆశ్రయించగా.. అరెస్టుకు రంగం సిద్ధం చేశారు.
Also Read: Crime News: డబ్బులు ఇవ్వలేదని.. భార్యను అతికిరాతకంగా నరికి చంపిన భర్త!
అప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన నందిగం సురేష్.. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. అదే సమయంలో మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ తెచ్చుకున్నారు. దాంతో టీడీపీ కార్యాలయం దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా.. విడుదల కాకుండానే పీటీ వారెంట్‌తో తుళ్లూరు పోలీసులు అక్టోబర్ 7న మరియమ్మ హత్య కేసులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ 21 వరకు తొలుత రిమాండ్ విధించగా.. తాజాగా దానిని కోర్టు పొడిగించింది.