Michaung Cycole Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tue, 05 Dec 202302:27 AM IST
తమిళనాడు గజగజ
మైచాంగ్ తుఫానుతో తమిళనాడు గజగజ వణుకుతోంది. వారం రోజుల కిందటే భారీ వర్షాలతో తల్లడిల్లింది. ప్రస్తుతం ఏపీలో కేంద్రీకృతమైన తుపాను ప్రభావాన్ని అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం .. తమ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. పుదుచ్చేరీ కరైకల్ కలై సెల్వీ, కాంచీపురం, చెన్నై, చెంగల్పట్, తిరువల్లూరు ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.
Tue, 05 Dec 202302:14 AM IST
ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు
తుపాను కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను కారణంగా ఉద్ధృతంగా వీస్తున్న ఈదురుగాలులతో జనం వణికి పోతున్నారు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉద్ధృతమైన గాలుల వల్ల పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Tue, 05 Dec 202302:12 AM IST
తూర్పు గోదావరిలో భారీ వర్షాలు
తుపాను కారణంగా ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, అమలాపురం మండలాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులతో పలు మండలాల్లో వరి పంట నేలకు ఒరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది.కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. – జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది.
Tue, 05 Dec 202302:11 AM IST
విశాఖ నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్
తుఫాను కారణంగా విశాఖపట్నంలో విమాన సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి మంగళవారం ఉదయం 9.00 గంటలకు విశాఖకు చేర్చాల్సిన ఇండిగో సర్వీస్ ను రద్దు చేశారు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లాల్సిన సర్వీసును, చెన్నై నుంచి విశాఖకు చేరాల్సిన సర్వీసును, మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ రావలసిన విమానం సర్వీసును రద్దు చేశారు.
Tue, 05 Dec 202302:10 AM IST
తిరుపతిలో భారీ వర్షం .. ఓ చిన్నారి మృతి
పెను తుపాన్‌గా ఆవిర్భవించిన మిచాంగ్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు చలితో వణికిపోతున్నారు. ఏర్పాడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలుడు యశ్వంత్ మరణించినట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత శనివారం నుంచీ ఏకధాటిగా ఈ చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Tue, 05 Dec 202302:09 AM IST
కాకినాడలో ఆరెంజ్ అలర్ట్
కాకినాడ జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి. సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు. దాదాపు పదికి పైగా విదేశీ నౌకలు నిలిచిపోయాయి. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని, వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్ అధికారులను ఆదేశించారు
Tue, 05 Dec 202302:09 AM IST
ఏపీలో 9జిల్లాలకు రెడ్ అలర్ట్
తుఫాన్ ప్రభావంతో ఏపీలో 9 జిల్లాలకు ఏపీ ప్రభుత్వం రెడ్ అలర్ట్ విధించింది. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించారు. ఏపీలో మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కడప, తూ.గో., కాకినాడ, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలో మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, మన్యం,విశాఖ, విజయనగరం, శ్రీకాకుళానికి ఎల్లో అలర్ట్ అమల్లో ఉంది.