Minister Kottu Satyanarayana: ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఈఓపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూలైన్లలో సరైన ఏర్పాట్లు లేవంటూ, టికెట్టు లేని వారిని ఎలా 500 రూపాయల దర్శనం లైన్‌లో పంపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: MLC Ashok Babu: చంద్రబాబుకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే..
మొదటి రోజు కావడంతో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అన్ని ఇబ్బందులు సర్దుకుంటాయన్నారు. ఎవరి బాధ్యత వారు నిబద్ధతతో నిర్వర్తిస్తే పొరపాట్లు జరగవన్నారు. ఎక్కడ లోపాలు ఉన్నాయో అవి సరి చేయడానికి వెంటనే అధికారులను పంపామన్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. మరుగుదొడ్లు వాడుకోడానికి ఏర్పాటు చేసిన వెసులుబాటు క్యూలైన్లు కలిసిపోవడానికి కారణం అయిందన్నారు. అమ్మవారి దర్శనంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. సర్వదర్శనం క్యూ లైన్లో వారిని 500 రూపాయల దర్శనం లైన్‌లో పంపుతున్న సీఐ ఎవరో కనుక్కుని చర్యలు తీసుకుంటామన్నారు. 500 రూపాయల దర్శనంలో ఒక లడ్డు ప్రసాదంగా ఇచ్చేలా ఏర్పాటు చేశామన్నారు.