తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు గౌరవిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయమని అన్నారు. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం అని కిషన్ రెడ్డి పేరొన్నారు. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించడంతో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు కిషన్ రెడ్డి కామారెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గౌరవిస్తున్నాం. కామారెడ్డిలో విజయం సాధించిన వెంకట రమణారెడ్డికి శుభాకాంక్షలు. కామారెడ్డిలో బీజేపీని గెలిలించిన ప్రజలకు ధన్యవాదాలు. అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించిన ప్రజలకు అభినందనలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం పెద్ద విజయం. కేసీఆర్ కుటుంబం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపుకి కారణం. బీజేపీ ఓటింగ్ పెరిగింది. ఎన్నికల్లో మా కీలక నేతలు ఓడిపోవడం దురదృష్టకరం. నిర్మాణాత్మక ప్రతిపక్షంలా ఉంటాం’ అని కిషన్ రెడ్డి అన్నారు.
‘కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఓడించాం. పార్లమెంట్ కి సెమీఫైనల్ ఎన్నికలుగా ఈ ఎన్నికలు సాగాయి. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం సంతోషం. ఇదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తాం. తెలంగాణలో ఈసారి అన్ని ఎంపీ సీట్లు గెలుస్తాం. మా తప్పిదాలను సవరించుకుంటాం. త్వరలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో జాతీయ నాయకుల సమావేశం, భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.