ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం లేకుండా భారత దేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీ గారిని చేయాలనేది ప్రజలందరి ఎజెండా అని ఆయన అన్నారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేది యావత్ ప్రజల నినాదమని, బీఆర్ఎస్ పార్టీకి ఈ దఫా ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం కలగదన్నారు ఈటల రాజేందర్. మోడీ ప్రతినిధిగా మీ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని, గురువింద సామేతలాగా రేవంత్ రెడ్డి ఇతరుల మీద బురద చల్లుతున్నాడని, పూటకో మాట మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు ఈటల రాజేందర్.
కేసీఆర్ ఖాళీ బిందెలు ఇచ్చారని ఇప్పుడు చెబుతున్నారు.. హామీలు ఇచ్చేటప్పుడు మీకు సోయి లేదా అని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డదారులైన తొక్కి అధికారంలోకి రావాలని చూశారు తప్ప ప్రజలపై ప్రేమతో కాదు.హామీలు అమలు చేయాలని చిత్తశుద్ధి లేదని, మొదటి ఆర్థిక మంత్రిగా హాస్టల్లో సన్నబియ్యం పెట్టింది నేనే. తినేంత బువ్వ పెట్టాలని జీవో ఇచ్చింది నేనే అని ఆయన తెలిపారు. 78 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలని మంజూరు చేయించానని, కుటుంబ సభ్యులు కూడా రాకపోతే వారి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పి కరోనా సమయంలో ఆదుకున్న బిడ్డను అని ఈటల వ్యాఖ్యానించారు. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నా చేతిలో పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.