- యూఎస్ మోడల్‌గా నటిస్తూ డేటింగ్ యాప్ స్కామ్..
- ఏకంగా 700 మంది మహిళల్ని మోసం చేసిన కేటుగాడు..
- ప్రైవేట్ వీడియోలు, ఫోటోలతో బ్లాక్‌మెయిల్..
Dating Apps fraud: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పగటిపూట ఓ ప్రైవేట్ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేస్తాడు. రాత్రి వేళల్లో మాత్రం అమెరికాకు చెందిన ఓ మోడల్‌గా మారుతాడు. ఈ కేటుగాడు తాను అమెరికాకు చెందిన మోడల్ అని, ఢిల్లీలో పర్యటిస్తున్నానని ఫోజ్ కొట్టి ఏకంగా 700 మంది మహిళల్ని మోసం చేశాడు. మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న సదరు వ్యక్తిని శుక్రవారం తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు తుషార్ సింగ్ బిష్త్(23) డేటింట్ ప్లాట్‌ఫారమ్‌లలో మోడల్‌గా నటిస్తూ వందలాది మంది మహిళల్ని మోసం చేశాడు. తుషార్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, అతని తల్లి గృహిణి, అతడి సోదరి గురుగ్రామ్‌లో పనిచేస్తోంది. మంచి ఉద్యోగం కలిగి ఉన్నప్పటికీ, డబ్బు మీద ఆశతో నేరాలకు అలవాటుపడ్డాడు.
యాప్ ద్వారా వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ ఫోన్ నెంబర్ల ఉపయోగించి, తుషార్ డేటింగ్ యాప్స్‌లో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టించేవాడు. యూఎస్‌కి చెందిన ఫ్రీలాన్స్ మోడల్‌ని అని, ఇండియాలో పర్యటిస్తున్నా అని చెబుతూ.. 18-30 ఏళ్ల మధ్య మహిళలతో స్నేహం చేసేవాడు. వారి నమ్మకాన్ని సంపాదించిన తర్వాత, వారి ఫోన్ నెంబర్లు, ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను అడిగేవాడు. బాధితులకు తెలియకుండా వాటిని ఫోన్ సేవ్ చేసుకునే వాడు. ప్రారంభంలో ఏదో ఫన్ కోసం చేసేవాడు, ఆ తర్వాత వారి నుంచి దోపిడి చేయడం ప్రారంభించాడు.
Read Also: Rum in Cake : హైదరాబాద్‌లో ఇక్కడ కేక్ తింటున్నారా.. జాగ్రత్త..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుషార్ ఈ విజువల్స్ ద్వారా మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదించే వాడు. ఒక వేళ బాధితులు డబ్బు ఇవ్వకుంటే, వారి ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. తుషార్ బంబుల్‌లో 500 మందికి పైగా మరియు స్నాప్‌చాట్ మరియు వాట్సాప్‌లో 200 మందికి పైగా మహిళల స్నేహం చేశాడు. వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి వారి సన్నిహిత వివరాలను సేకరించాడు. డిసెంబరు 13, 2024న రెండవ సంవత్సరం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అలాంటి ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరం జనవరిలో ఆమె తుషార్‌తో బంబుల్‌లో కనెక్ట్ అయింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యాయి.
విద్యార్థిని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. ఈ క్రమంలో యువతి ఒక ప్రైవేట్ వీడియోని పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బుల కోసం వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ సైబర్ పోలీస్ స్టేషన్ ఏసీపీ అరవింద్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు ఉపయోగించిన మొబైల్, అంతర్జాతీయ మొబైల్ నెంబర్లు, వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.