గత ప్రభుత్వంలో రైతు బంధుకు పరిమితి లేదు. కొండలు, గుట్టలు, రహదారులు, అధికారులు, వ్యాపారులు, ఇలా ఎవరికైనా రైతు బంధు జమ అయ్యేది. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇన్ని ఎకరాలకు రైతు భరోసా అందించాలని పరిమితి విధించనుంది. 5 నుంచి 10 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో రైతుబంధు పట్టా భూములకే వచ్చింది. దీంతో అసైన్డ్ భూములు ఉన్నవారు నష్టపోయారు. కౌలు రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇవన్నీ గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలో రైతు భరోసా అందించాలని రైతులు కోరుతున్నారు.