Homeజాతీయంఅయోధ్యలో వాటర్ బాటిల్ ఇస్తే రూ.5 రిఫండ్, అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

అయోధ్యలో వాటర్ బాటిల్ ఇస్తే రూ.5 రిఫండ్, అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!


Plastic Bottles Refund In Ayodhya: సోషల్ మీడియాలో రోజుకో విషయం వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా అయోధ్య రామాలయం గురించి అయితే రోజుకో వార్త ప్రచారం జరిగింది. ఆన్‌లైన్‌లో అయోధ్య ప్రసాదం విక్రయం, ప్రత్యేక దర్శనం, వీఐపీ దర్శనం అంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. తాజాగా అలాంటి వార్తే మరొకటి వైరల్ అయ్యింది. ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తిరిగి ఇస్తే రూ.5 రిఫండ్ అందుతుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. వాటర్ బాటిల్‌పై ఓ క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే రూ.5 పొందవచ్చని రాసి ఉంది. 

బాటిల్‌ స్టిక్కర్‌పై కబాడీవాలా సంస్థకు చెందిన డిపాజిట్ రిఫండ్ సిస్టమ్‌ పేరుతో క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేస్తే ఓ వెబ్ పేజీ ఓపెన్ అయ్యి కలెక్షన్ పాయింట్ పేరుతో రిఫండ్ సెంటర్ అని కనిపిస్తుంది.    ఆ తరువాత ఎటువంటి విషయాలు అందులో కనిపించవు. అలాగే స్టిక్కర్‌పై ఉన్న కబాడీవాల సంస్థ గురించి ఇంటర్నెట్‌, ట్విటర్‌లో వెతకగా అది ఒక వ్యర్థాల నిర్వహణ కంపెనీగా తెలిసింది. ఆ సంస్థకు చెందిన ట్విటర్ పేజీలో బాటిల్ రిఫండ్ గురించి పోస్ట్ చేసి ఉంది. ఆ కంపెనీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే డిపాజిట్ రిఫండ్ సిస్టమ్ పేరుతో హోం పేజీ కనిపిస్తుంది. అందులో అయోధ్య నగర్ నిగమ్‌ సహకారంతో అయోధ్యను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది.
 
వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తూ.. కలెక్షన్ పాయింట్ల వద్ద ఖాళీ వాటర్ బాటిళ్లను జమ చేస్తే.. వారికి రూ.5 రిఫండ్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని బోపాల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ప్రముఖంగా ప్రస్తావించింది. అలాగే కొన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన మీడియా సంస్థలు ఈ విషయాలను ప్రముఖంగా ప్రచురించాయి. 
 
అయితే వాస్తవం తెలుసుకోవడానికి ది కబాడీవాలా సంస్థను పలువురు సంప్రదించారు. సదరు కంపెనీ స్పందిస్తూ.. ఇది DRS సిస్టమ్ అని స్పష్టం చేస్తూ ఈ మెయిల్ చేసింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, వస్తువుల రీసైక్లింగ్‌ను ప్రోత్సహించడం, చెత్త వేయడాన్ని తగ్గించడం తమ సంస్థ లక్ష్యమని పేర్కొంది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ను సంస్థ బయటపెట్టింది. వినియోగదారులు వాటర్ బాటిల్ కొనుగోలు చేసే సమయంలో అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. 

ఉదాహరణకు వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 అయితే మీరు అదనంగా రూ.5 కలిపి మొత్తం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగం తరువాత కలెక్షన్ పాయింట్ల వద్ద ఖాళీ బాటిల్ అప్పగిస్తే మీరు చెల్లించిన రూ.5 తిరిగి వెనక్కి ఇస్తారు. ఖాళీ బాటిళ్లను తిరిగి ఇచ్చేలా వినియోగదారులను ప్రోత్సహించడానికి ఇలా చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను కబాడీవాలా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది.

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments