IND vs SL:
ఆసియాకప్ 2023 సూపర్-4 రెండో మ్యాచులో టీమ్‌ఇండియా ఇబ్బంది పడుతోంది. శ్రీలంకపై పరుగులు చేస్తున్నప్పటికీ టాప్ ఆర్డర్ వికెట్లు చేజార్చుకుంది. 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 128 స్కోర్ చేసింది. పాక్ మ్యాచులో సెంచరీ కొట్టిన కేఎల్ రాహుల్ (18; 23 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (18; 42 బంతుల్లో 1×4) అతడికి తోడుగా ఉన్నాడు. భారత్ భారీ స్కోరు చేయాలంటే వీరిద్దరూ కచ్చితంగా నిలబడాల్సిందే. స్పిన్నర్ల బౌలింగులో ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. దునిత్ వెల్లలగె 3 వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7×4, 2×6) తొలి ఓవర్ నుంచే విజృంభించాడు2. చక్కని షాట్లు బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతడికి శుభ్‌మన్ గిల్ (19; 25 బంతుల్లో 2×4) తన సహచరుడికి స్ట్రైక్ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ ఆడిన వేగానికి భారత్ 10 ఓవర్లకే 65 పరుగులు చేసింది. ఇదే క్రమంలో 44 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్నాయి. అయితే జట్టు స్కోరు 80 వద్ద వెల్లలగె వేసిన ఫ్లెయిటెడ్ డెలివరీని ఆడబోయి గిల్ బౌల్డ్ అయ్యాడు.
మరో పది పరుగులకే కింగ్ విరాట్ కోహ్లీ (3)నూ వెల్లలగేనే పెవిలియన్‌కు పంపించాడు. లెగ్‌సైడ్ ఆడబోయిన అతడు శనకకు క్యాచ్ ఇచ్చాడు. ఇక 15.1వ బంతికి ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్‌నూ వెల్లలగె క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో టీమ్‌ఇండియా టాప్ 3 వికెట్లు అతడి ఖాతాలోకే వెళ్లాయి. ఈ ముగ్గురూ ఔటయ్యాక కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్క దిద్దుతున్నారు. ఆచితూచి ఆడుతున్నారు. అనవసరంగా షాట్లు ఆడటం లేదు. సింగిల్స్ తీస్తూ స్కోరు పెంచుతున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక జట్టు: పాథుమ్ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్ వెల్లలగె, మహీశ థీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరణ
పిచ్ రిపోర్ట్: పాక్ మ్యాచ్‌తో పోలిస్తే పిచ్ భిన్నంగా ఉంది. వికెట్‌పై అస్సలు పచ్చిక లేదు. ఇది పాత ప్రేమదాస స్టేడియాన్ని గుర్తుకు తెస్తోందని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. ఆకాశం నిర్మలంగా ఉంది. కారు మబ్బులేమీ లేవు.