Saif Ali Khan News: మహమ్మద్ మన్సూర్ ఆలీ ఖాన్… నీ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టే వాళ్ళు దేశంలో కాస్త తక్కువే ఉండొచ్చు కానీ… “టైగర్ “పటౌడి అంటే మాత్రం అటు క్రికెట్ ప్రేమికులు ఇటు బాలీవుడ్ అభిమానులు వెంటనే గుర్తు పట్టేస్తారు. దుండగుడి చేతుల్లో కత్తిపోట్లకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తండ్రి ఈ “టైగర్ ” పటౌడినే. “పటౌడి” సంస్థానపు యువరాజుగా అన్ని సౌకర్యాలు ఉన్నా క్రికెట్ మీద మక్కువతో నిరంతర సాధన చేసి అతి తక్కువ వయసులోనే ఇండియన్ టీంలోకి ఎంట్రీ ఇచ్చారు “పటౌడి”.
మైదానంలో పెద్ద పులిలా కదిలే మన్సూర్ అలీ ఖాన్
క్రికెట్ మైదానంలో తీక్షణమైన దృష్టితో చురుకుగా కదిలే “పటౌడి” ఫీల్డింగ్‌లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేశారు. దానితో ఆయన్ని అందరూ ” టైగర్”అని పిలిచేవారు. ఆయన జాతీయ టీంలోకి ఎంట్రీ ఇవ్వడానికి 6నెలల ముందు ఒక కార్ యాక్సిడెంట్‌లో ఒక కన్ను కోల్పోయారు. నిజానికి ఆయన కెరీర్ అక్కడితో అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పట్టుదలతో కోలుకొని ఒంటికన్నుతోటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. మీదికి దూసుకొచ్చే బంతిని కరెక్ట్‌గా జడ్జి చేయడం కోసం తలపై క్యాప్‌ను ఒక కన్నును కవర్ చేసేలాగా ముందుకు లాగి పెట్టుకునేవారు. ఆలా ప్రాక్టీస్ చేసి క్రికెట్‌పై పట్టు సాధించి టీంలోకి ఎంట్రీ ఇచ్చారాయన. 21 ఏళ్ల వయసులో జాతీయ టెస్ట్ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యారు. ఆ రికార్డు చాలాకాలం ఆయన పేరు మీద ఉండేది. తర్వాత కాలంలో జింబాబ్వే కెప్టెన్ ‘తైబు ‘ (2004), ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ‘రషీద్ ఖాన్ ‘(2019) ఆ రికార్డును బద్దలు కొట్టారు. ఇప్పటికీ ప్రపంచంలో చిన్న వయసులో టెస్ట్ కెప్టెన్ అయిన క్రికెటర్ల లిస్టులో పటౌడి మూడో స్థానంలో ఉన్నారు. ఆయన క్రికెట్ ఆడే టైంలో ‘ప్రపంచపు గ్రేటెస్ట్ ఫీల్డర్’గా కామెంటేటర్ లు పిలిచేవారు.
Also Read: తూచ్ .. సైఫ్ పై దాడి చేసింది ఆ వ్యక్తి కాదు – వదిలేసిన పోలీసులు – మరి ఎవరు ?
ఇండియన్ క్రికెట్ టీంకు దూకుడు నేర్పిన వ్యక్తి
టైగర్’పటౌడి 1961 -1975 మధ్యకాలంలో మొత్తం 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అందులో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. వాటిలో 6సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాధించారు. ఒక డబుల్ సెంచరీ కూడా ఆయన పేరు మీద ఉంది. వీటన్నిటి కంటే భారత జట్టుకు దూకుడు నేర్పిన వ్యక్తిగా టైగర్’ పటౌడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంత వరకు డిఫెన్సివ్‌గా ఆడే ఇండియన్ టీంకు అగ్రెసీవ్‌గా ఆడడం నేర్పింది “టైగర్” అనీ..ఆయనే ఇన్స్పిరేషన్ అని సౌరవ్ గంగూలీ పలుమార్లు తెలిపారు. న్యూజిలాండ్‌పై మొట్టమొదటిసారిగా ఇండియన్ టీం టెస్ట్ మ్యాచ్ గెలిచింది ‘ పటౌడి’ నాయకత్వంలోనే. ఆయన సేవలకు గుర్తుగా బీసీసీఐ భారత క్రికెటర్లకి ఇచ్చే అత్యున్నత పురస్కారం ” సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ” ను 2001 లో ప్రకటించింది.
స్టార్ హీరోయిన్ షర్మిల ఠాగూర్‌తో ప్రేమ -పెళ్లి
ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌గా ఉన్న టైంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షర్మిల ఠాగూర్‌తో ప్రేమలో పడ్డారు పటౌడి. 1968లో పెళ్లి చేసుకున్న ఆ జంటకు ముగ్గురు పిల్లలు. పెద్దవాడు ‘సైఫ్ అలీ ఖాన్ ‘ బాలీవుడ్‌లో స్టార్ నటుడుగా ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఒక కుమార్తె ‘సభా అలీ ఖాన్’ నగల వ్యాపారిగా స్థిరపడితే మరో కుమార్తె ‘సోహా ఆలీ ఖాన్’ నటిగా కొనసాగుతున్నారు. 25 ఆగస్టు 2011లో 70 ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల వ్యాధితో మృతి చెందిన టైగర్’ పటౌడిని ఆయన సంస్థానంలో ఖననం చేసారు. ఒక రాజ సంస్థానపు అధినేతగానే కాదు భారత జాతీయ క్రికెట్ టీం గ్రేటెస్ట్ కెప్టెన్‌లలో ఒకరుగా ‘టైగర్’ పటౌడి చరిత్రలో నిలిచిపోయారు.
Also Read: సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ ఇంట్లో సెక్యూరిటీ కెమెరాస్ లేవా – షాక్‌లో పోలీసులు
మరిన్ని చూడండి