Gongadi Trisha Updates: తెలంగాణ ప్లేయర్ గొంగిడి త్రిష (47 బంతుల్లో 52, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడంతో ఇనాగురల్ అండర్ -19 మహిళా ఆసియాకప్ ను భారత్ దక్కించుకుంది. ఈ టోర్నీలో ఆద్యంతం పరుగుల వరద కనబర్చిన త్రిష.. ఫైనల్లోనూ తన సత్తాచాటింది. దీంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ను 41 పరుగులతో ఓడించిన భారత్, తొలిసారి విజేతగా రికార్డులకెక్కింది. ముఖ్యంగా బౌలర్లు కూడా రాణించడంతో 118 పరుగుల చిన్న లక్ష్యాన్ని భారత్ కాపాడుకుంది. భారత స్పిన్ త్రయం ఏడు వికెట్లు తీసి బంగ్లా నడ్డి విరిచారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన భారత మహిళా జట్టు.. విజేతగా నిలిచింది.
“History made! 🇮🇳 India’s Under-19 Women’s team clinches the inaugural Asia Cup with a stunning 41-run victory over Bangladesh. Gongadi Trisha shines with the bat, and Aayushi Shukla dominates with the ball! 🏏 #U19WomensAsiaCup #TeamIndia” pic.twitter.com/sDy1ZeGZTh
— HK Chronicle (@HK_Chronicle_) December 22, 2024
త్రిష వన్ విమెన్ షో..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు సాధించ లేక పోయింది. నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగుల స్కోరే చేయగలిగింది. తెలంగాణలోని భద్రాచలంకు చెందిన బ్యాటర్ త్రిష (52) అర్ధ సెంచరీతో సత్తా చాటి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.. ఒక వైపు వికెట్లు పడతున్నా ఓపికగా ఆడి, ఫిఫ్టీ సాధించింది. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగెలెత్తించింది. దీంతో భారత్ కు పోరాడగలిగే స్కోరును అందించింది. మిగతా బ్యాటర్లలో మిథిలా 17 పరుగుల కీలక రన్స్ సాధించింది. ఫైనల్ ఓవర్లో రెండు బౌండరీలు సాధించిన మిథాల సత్తా చాటింది. ఇక బౌలర్లలో ఫర్జానా (4/31)తో సత్తా చాటింది. యువ సంచనలం కమలినితో సహా సానిక, త్రిష, మిథిలాలను ఔట్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. అలాగే మరో బౌలర్ నితీషా రెండు వికెట్లతోరాణించింది. హబీబాకు ఒక వికెట్ దక్కింది.
తిప్పేశారు..
బంతికొక పరుగు సాదించినా తేలికగా గెలిచే మ్యాచ్ ను బంగ్లాదేశ్ చేజార్చుకుంది. ముఖ్యంగా స్పిన్ త్రయం పారునిక సిసోడియా, ఆయూషి శుక్లా, సోనమ్ యాదవ్ బంగ్లా బౌలర్లను రఫ్ఫాడించారు. గింగరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి పని పట్టారు. ముఖ్యంగా ఆయూషి (3/17) కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ గా కనిపించింది. వీరు ముగ్గురే ఏకంగా ఏడు వికెట్లు సాధించడం విశేషం. దీంతో బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో జువైరియా ఫిర్దోస్ (22), ఫహోమిదా చోయ (18) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.
టోర్నీలో రెండు అర్థసెంచరీలు సహా 159 పరుగులతో టాప్ లేపిన త్రిషకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా త్రిషకే లభించడం విశేషం. ఓపెనర్ నిలకడగా రాణించి, జట్టు విజయాల్లో త్రిష కీలక పాత్ర పోషించింది.
మరిన్ని చూడండి