U-19 worldcup in 2008 Final: భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని క్రికెటర్లను అందించింది అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్. 5 సార్లు యువ క్రికెటర్లు ప్రపంచకప్ ని ముద్దాడారు అంటే ఏ స్థాయిలో అండర్-19 ఆటగాళ్లు చెలరేగిపోతారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి మర్చిపోలేని ఒక వరల్డ్ కప్ గెలిచి నేటికి సరిగ్గా 16 ఏళ్ళు. 16 ఏళ్ళ క్రితం విరాట్ కోహ్లి నాయకత్వంలోని టీంఇండియా ప్రపంచకప్ గెలిచి భారత క్రికెట్ లో ఒక కొత్త శకానికి నాంది పలికారు. అయితే, అప్పుడు మనం ఎవరిమీద గెలిచాం? ఆ టీంలో ఎవరెవరు ఉన్నారు? వారిలో ఇప్పటికీ టీం ఇండియాలో కొనసాగుతున్న వారు ఎవరెవరున్నారు? ఒక్క సారి ఆ తీపిగుర్తులను నెమరువేసుకొందాం.
కౌలాలంపూర్ వేదికగా ఫైనల్..
2008 మార్చి 2న మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌జరిగింది. యంగ్ ఇండియా దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. టాస్‌గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకొంది. అంతకు ముందు యంగ్ ఇండియా సెమీఫైనల్ లో న్యూజీలాండ్ మీద డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిన గెలిచి ఫైనల్ చేరింది. దీంతో ఫైనల్ మ్యాచ్ రోజు వర్షం పడే సూచనలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా అన్న సందేహం కలిగింది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన యువ ఇండియాకు వేర్నీ పార్నెల్ నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు గట్టి సవాలే విసిరింది. 27 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టింది. తర్వాత తన్మయ్ శ్రీ వాస్తవ కెప్టెన్ కోహ్లితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తన్మయ్46, కోహ్లీ19, మనీష్ పాండే,సౌరభ్ తివారీ చెరో 20 పరుగులు చేసారు. యంగ్ ఇండియా 45 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
కొత్త శకానికి నాంది
తర్వాత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా రవీంద్ర జడేజా, అజితేష్ అర్గల్, సిద్ధార్థ్ కౌల్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 12పరుగుల తేడాతో గెలిచింది. విజయం అనంతరం కప్ అందుకొన్న సమయంలో విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్ లో భారత కొత్త శకానికి నాంది ఈ విజయం అని కూడా చెప్పాడు.
ఇక 2008 ప్రపంచకప్ గెలిచిన సభ్యుల్లో చాలా మంది టీంఇండియాకు ఆడారు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీంఇండియాలో కీలక సభ్యుడే కాదు… ప్రపంచ క్రికెట్లో పరుగుల వీరుడిగా, కింగ్ కోహ్లీ గా అవతరించాడు. రవీంద్ర జడేజా టీం ఇండియాలో కీలక ఆల్‌రౌండర్. బ్యాటింగ్,బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా ఒంటిచేత్తో టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఇక మనీష్‌పాండే, సౌరభ్ తివారీ, సిద్ధార్థ్ కౌల్, ప్రదీప్ సంగ్వాన్ వంటి వారికి అవకాశాలు వచ్చినా సరిగా ఉపయోగించుకోలేక పోయారు. ఐపీయల్ లో కోట్లు పెట్టి ఆయా జట్లు కొనుక్కొన్నా ఒకటి,రెండు మ్యాచ్ లు తప్ప వీరు పెద్దగా రాణించలేక పోయారు. ఇక టీం ఇండియాలో విపరీతమైన పోటీ, దేశవాలీ మ్యాచ్‌ల్లో ప్రతిభ చూపిన యంగ్ ప్లేయర్లు రావడంతో వీరికి టీం ఇండియా జాతీయ జట్టు తలుపులు మూసుకుపోయాయనే చెప్పాలి.
ఇక, ప్రపంచకప్ ఫైనల్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ గెలుచుకొన్న అజితేష్ అర్గల్ ఐతే టీంఇండియా దరిదాపుల్లోకి రాలేదు. ఐపీయల్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ తరఫున బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేదు. తన్మయ్ శ్రీవాస్తవ, గోస్వామి లాంటి వారు పెద్దగా కనిపించలేదు సరికదా.. ఎక్కడా వినిపించలేదు.
అటు దక్షిణాఫ్రికా టీంలో కూడా రోసోవ్, హెండ్రిక్స్, వేర్నీ పార్నెల్, స్మట్స్ తప్ప ఎవరూ జాతీయ జట్టుకు ఆడలేదు. పలు సందర్బాల్లో ఈ ఆటగాళ్లు టీం ఇండియాతో తలపడుతున్నప్పుడు ఈ వరల్డ్ కప్ ఫైనల్ ని గుర్తు చేసుకొంటుంటారు. ఇలా ఈ రోజు విరాట్ కోహ్లీ, అలాగే ఇండియా ఫ్యాన్స్ ప్రపంచకప్ గెలిచిన క్షణాన్ని గుర్తు చేసుకొంటూ ఖుషీ అయిపోతున్నారు.
మరిన్ని చూడండి