MCA Create a new Guinness World Record: ముంబైలోని వాంఖెడే క్రికెట్ స్టేడియం పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది. స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 14వేల 505 బంతులతో స్టేడియానికి సంబంధించి కొన్ని పదాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇన్ని బంతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన స్టేడియంగా వాంఖెడే స్టేడియం రికార్డులకెక్కింది. తాజాగా ఈ రికార్డు సాధించడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ప్రెసిడెంట్ అజింక్య నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ముంబై తరపున ఆడిన దివంగత ఏకనాథ్ సోల్కర్ కు ఈ రికార్డు అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఆయనలాగే ముంబైకి ప్రాతినిథ్యం వహించి, ప్రస్తుతం జీవించిలేని క్రికెటర్లకు కూడా అంకితమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎరుపు, తెలుపు బంతులను వాడారు. చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పదాలు, వాంఖెడేకు కొత్త శోభను తీసుకొచ్చాయని క్రికెట్ అభిమానులు పేర్కొన్నారు.
.@MumbaiCricAssoc celebrated 50 years of Wankhede Stadium by creating a Guinness World Records™ title using 14,505 balls to commemorate the stadium’s historic milestone! 🏟🏏 @ajinkyasnaik #Wankhede50 pic.twitter.com/XVady4c4Yg
— Prathamesh Avachare (@onlyprathamesh) January 23, 2025
1975లో తొలి మ్యాచ్..
1975లో భారత్ లో పర్యటించిన వెస్టిండీస్.. జనవరి 23 నుంచి 29 వరకు టెస్టు మ్యాచ్ ను ఆడింది. వాంఖెడే స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఎంసీఏ వారోత్సవాలు నిర్వహించింది. పలువురు క్రికెటర్లను కూడా సన్మానించింది. ఈ క్రమంలోనే క్రికెట్ బంతులతో గిన్నీస్ రికార్డుకు ప్రయత్నించి, సఫలమైంది. మరోవైపు ఈ రికార్డులో భాగమైన ఎరుపు, తెలుపు బంతులను వర్థమాన క్రికెటర్లకు ఇస్తామని అజింక్య నాయక్ తెలిపారు. రికార్డు ద్వారా స్ఫూర్తి పొంది, మరింత ఉత్తమమైన క్రికెటర్లుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని క్రికెట్ క్లబ్బులు, అకాడమీలు, ఎన్జీవోలకు కూడా ఈ బంతులను అందించనున్నట్లు వెల్లడించారు. ఇక వెస్టిండీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఏకనాథ్ సోల్కర్ సెంచరీ బాదాడు. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టినందుకుగాను ప్రత్యేకంగా ఈ రికార్డును ఆయనకు అంకితమిస్తున్నట్లు ఎంసీఏ వర్గాలు తెలిపాయి.
వాంఖెడేలో ఎన్నో మధురానుభూతులు..
భారత క్రికెట్ ప్రేమికులకు వాంఖెడే స్టేడియంతో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. భారత్ సాధించిన రెండో వన్డే ప్రపంచకప్ 2011లో వాంఖెడే మైదానంలో సాధించడం విశేషం. అలాగే ఇంకా ఎన్నో మధురమైన మ్యాచ్ లకు వాంఖెడే వేదికగా నిలిచింది. ఇక గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచిన, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను ఇదే వేదికపై ఆడాడు. ఆ మ్యాచ్ ద్వారా 24 సంవత్సరాల ఉజ్వలమైన కెరీర్ కు వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్ కు స్వయంగా సచిన్ తల్లి హాజరైంది. సచిన్ ఆడిన మ్యాచ్ కు తన తల్లి హాజరు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచిన్ కోరికతోనే బీసీసీఐ తన చివరి మ్యాచ్ ను వాంఖెడేలో షెడ్యూల్ చేసింది. సచిన్ లాంటి ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లకు వాంఖెడే జన్మస్థానమైంది. ఇక్కడ మ్యాచ్ లు ఆడుతూ, అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో శిఖరాలకు వెళ్లినవారు ఉన్నారు. వారందరిని తలుచుకుని భారత అభిమానులు ఎమోషనల్ అయ్యారు. మరోవైపు రజతోత్సవం సందర్భంగా గిన్నిస్ రికార్డు సాధన కోసం ప్రయత్నించిన ఎంసీఏ పెద్దలను ఈ సందర్భంగా అభినందిస్తున్నారు.
మరిన్ని చూడండి