Rohit Captaincy: వచ్చేనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం ప్రకటించానున్నారు. అయితే ఈ టోర్నీకి కెప్టెన్ గా రోహిత్ శర్మే ఉండనున్నాడని తెలుస్తోంది. ముంబైలో రోహిత్ తో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించనున్నారు. వచ్చేనెల 6 నుంచి ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు కూడా టీమ్ ను ప్రకటించనున్నారు. మెగాటోర్నీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగ పడనుంది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో రోహిత్ తనంతట తాను తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ కెప్టెన్సీకి ముప్పు వచ్చినట్లేనని ప్రచారం జరిగింది. అయితే వచ్చే చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ కే సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పేలవ ఫామ్ లో హిట్ మ్యాన్..
గతేడాది న్యూజిలాండ్ పర్యటన నుంచి రోహిత్ ఫామ్ కోల్పోయాడు. నిజానికి అంతకుముందు జరిగిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ లోనూ అంతంతమాత్రంగానే రాణించాడు. మూడు మ్యాచ్ ల కివీస్ సిరీస్ లో కేవలం 91పరుగులు చేసిన రోహిత్, ఆసీస్ టూర్లో మరింత దారుణ ప్రదర్శన కనబర్చాడు. మూడు టెస్టులు ఆడి కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో ఆసీస్ గడ్డపై అత్యంత చెత్త ప్రదర్శన చేసిన కెప్టెన్ గా నిలిచాడు. ఈక్రమంలో ఐదో టెస్టుకు విమర్శలకు జడిసి, జట్టు నుంచి 37 ఏళ్ల రోహిత్ దూరమయ్యాడు. అయితే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తోపాటు చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ కు ఒక చాన్స్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ లో ఫైనల్ కు చేర్చిన రోహిత్ పై బోర్డు నమ్మకముంచింది.
బుమ్రా, కరుణ్ డౌటే..
ఇక చాంపియన్స్ ట్రోపీతోపాటు ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా మెగాటోర్నీలోని తొలి రెండు మ్యాచ్ లకు బుమ్రా బరిలోకి దిగడని కథనాలు వస్తున్నాయి. వెన్నునొప్పితో బుమ్రా బాధపడుతున్న సంగతి తెలిసిందే. అతని గాయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవారంలో ఎన్సీఏలో బుమ్రాను పరీక్షించిన తర్వాత అతని పరిస్థితిపై ఒక అవగాహనకు బోర్డు మెడికల్ టీం వస్తుంది. ఈలోగా టీమిండియాలోకి అతడిని ఎంపిక చేసే అవకాశాలు లేవని సమాచారం. అయితే ఫిబ్రవరి 13 వరకు జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీంతో ఆ తర్వాత బుమ్రా గాయాన్ని బట్టి, తుది స్క్వాడ్ లో మార్పులు చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు విజయ్ హాజారే టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉండి సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న వెటరన్ ప్లేయర్ కరుణ్ నాయర్ కు వన్డే జట్టులో స్థానం దక్కే అవకాశం లేదు. ప్రస్తుతం జట్టులో అందరూ కుదురుకున్నారని, కరుణ్ కోసం ఏ ఒక్క ప్లేయర్ ని బయటకు పంపే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై శనివారం స్పష్టత రానుంది.
మరిన్ని చూడండి