Ind vs Eng First innings Highlights: టీ 20 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా(India) బ్యాటర్లు రాణించారు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో…బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా బ్యాటర్లు… ఇంగ్లాండ్( England) ముందు సవాల్ విసిరే లక్ష్యాన్ని ఉంచారు. బ్యాట్‌పైకి బంతి రావడమే గగనమైన వేళ భారత బ్యాటర్లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన సహజశైలికి విరుద్ధంగా కాస్త ఓపిగ్గా ఆడిన రోహిత్ అర్ధ శతకంతో మెరిశాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 171 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ముందు 172 పరుగుల లక్ష్యం ఉంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ ఈ పిచ్‌పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలికైన పని కాదని అర్ధమవుతోంది. స్లో పిచ్‌పై బ్యాటర్లు తమ పనిని సమర్థంగా పూర్తి చేయగా… ఇక మిగిలిన పనిని బుమ్రా(Bumrah) సారథ్యంలోని బౌలింగ్ దళం పూర్తి చేయాల్సి ఉంది.
బ్యాటర్లకు పిచ్ పరీక్ష
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారధి జాస్ బట్లర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. వర్షం పడడం.. అవుట్ ఫీల్డ్ కాస్త తడిగా ఉండడంతో బట్లర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. అనుకున్నట్లే ఆరంభం నుంచే పిచ్ బౌలర్లకు పరీక్ష పెట్టడం మొదలైంది. విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. సెమీస్‌లో అద్భుత రికార్డు ఉన్న కోహ్లీ.. తోప్లే కళ్లు చెదిరే సిక్స్‌తో ఇన్నింగ్స్‌కూ ఊపు తెచ్చాడు. అయితే అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు యత్నించి కోహ్లీ అవుటయ్యాడు. దీంతో టీమిండియా 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మకు జత కలిసిన పంత్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ భారీ షాట్లు ఆడేందుకు పిచ్ ఏ మాత్రం సహకరించక పోవడంతో పంత్ కూడా స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయాడు. అయితే తొమ్మిది బంతుల్లో 9 పరుగులు చేసిన పంత్‌ను శామ్ కరణ్ అవుట్ చేశాడు. దీంతో40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
సూర్య-రోహిత్ భాగస్వామ్యం
ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఎనిమిది ఓవర్లకు స్కోరు 55 పరుగుల వద్ద ఉండగా మరోసారి వర్షం పడింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన ఈ జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో రోహిత్ 39 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కాసేపటికే సూర్య కూడా అవుటయ్యాడు. సూర్య 36 బంతుల్లో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం హార్దిక్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేసి పాండ్యా అవుటయ్యాడు. శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై నిరాశపరిచాడు. చివరి రెండు ఓవర్లలో జడేజా, అక్షర్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 171 పరుగులు చేసింది.
మరిన్ని చూడండి