Head, Smith Centuries: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 28/0తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్.. ఆట ముగిసేసరికి 7 వికెట్లకు 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ (160 బంతుల్లో 152, 18 ఫోర్లు) భారత్‌కు మరోసారి తలనొప్పిగా మారాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కెరీర్‌లో 9వ సెంచరీని సాధించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన హెడ్ దాదాపు బంతికో పరుగు చొప్పున సాధించాడు. ఇక ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (47 బంతుల్లో 45 బ్యాటింగ్, 5 ఫోర్లు, ఒక సిక్సర్) వన్డే తరహాలో ఆడుతున్నాడు. అతనికి మిషెల్ స్టార్క్ (7 బ్యాటింగ్) సహకారం అందిస్తున్నాడు. అబేధ్యమైన ఎనిమిదో వికెట్‌కు వీరిద్దరూ 20 పరుగులు జోడించారు.
Travis Head and Steve Smith were the stars on Day Two at the Gabba.#AUSvIND pic.twitter.com/yZszmYQQS7
— cricket.com.au (@cricketcomau) December 15, 2024
బుమ్రా పాంచ్ పటాకా..
ఇక ఈ ఇన్నింగ్స్‌లో భారత పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మరోసారి తన విలువేంటో చాటుకున్నాడు. సహచర పేసర్లు విఫలమైన వేళ, తను 5 వికెట్లతో సత్తా చాటాడు. అతను సాధించిన 5 వికెట్లు టాపార్డర్ వాళ్లవే కావడం విశేషం. ఇక ఆట ప్రారంభమైన కాసేపటికే చక్కని బంతితో ఉస్మాన్ ఖవాజా (21)ను పెవిలియన్‌కు పంపాడు. ఐదో వికెట్‌పై వచ్చిన బంతిని ఖవాజా ఆడగా, అది నేరుగా కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. ఇక మరో ఓపెనర్ నాథన్ మెక్ స్విన్నీ (9) బుమ్రా బౌలింగ్‌లో కాసేపటికే స్లిప్పులో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో టెస్టులో సత్తా చాటిన మార్నస్ లబుషేన్ (12)ను తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి బోల్తా కొట్టించాడు. తను డ్రైవ్ ఆడిన బంతిని కోహ్లీ అద్భుతంగా అందుకోవడంతో మార్నస్ ఇన్నింగ్స్ ముగిసింది.
అద్భుత భాగస్వామ్యం..
ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్లో 33వ సెంచరీ (190 బంతుల్లో 101, 12 ఫోర్లు)తో ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. హెడ్‌తో కలిసి ఆరంభంలో ఆచితూచి ఆడిన అతను.. తర్వాత తనదైన క్లాస్‌ను చూపించాడు. వీరిద్దరూ దాదాపు రెండున్నర సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 241 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరికి మూడో సెషన్లో బుమ్రా.. చక్కని బంతితో ఈ భాగస్వామ్యాన్నివిడదీశాడు. కాసేపటికే ఒకే ఓవర్లో మిషెల్ మార్ష్ (5), హెడ్‌ను పెవిలియన్‌కు పంపిన బుమ్రా.. ఫైవ్ వికెట్ హాల్ పూర్తి చేశాడు. చివర్లో ప్యాట్ కమిన్స్ (20)ను మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కేరీ- స్టార్క్ జోడీ మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు.
మరిన్ని చూడండి