పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20(T 20 International) లలో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని రికార్డును తన పేరిట నమోదు చేసుకునేందుకు రోహిత్(Rohit Sharma) కేవలం ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు హిట్ మ్యాన్ పేరు మీదే ఉంది. అంతేనా పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగులు3,853 రన్స్ చేసిన రెండో ఆటగాడిగానూ కొనసాగుతున్నాడు. ఇప్పుడు మరో రికార్డును హిట్‌మ్యాన్ తన పేరిట లిఖించుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.
రోహిత్ ఒక్కడే
దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో మరోసారి కెప్టెన్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌తో ఇప్పటివరకు 149 మ్యాచ్‌లు ఆడిన భారత సారథి .. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఘనత అందుకోనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌లు ఆడి 11వ స్థానంలో ఉన్నాడు.
టీ20లలోఅత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు
1. రోహిత్ శర్మ(ఇండియా)- 149
2. పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 134
3.జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)- 128
4. షోయబ్ మాలిక్(పాకిస్తాన్)- 124
5. మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 122
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్కడే
పొట్టి క్రికెట్‌లో ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్న హిట్‌మ్యాన్.. అఫ్గాన్(Afghan)తో మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించడం ద్వారా హిట్‌మ్యాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్(Rohit Sharma) ఈ ఘనతను కేవలం 149 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో గెలిచి… అంతర్జాతీయ స్థాయిలో ఒక జట్టు తరఫున వంద మ్యాచ్‌లలో గెలిచిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కుతాడు. 36 ఏళ్ల రోహిత్.. ఇప్పటివరకూ భారత్ తరఫున 100 మ్యాచ్‌ల విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఒక క్రికెటర్ ఇన్ని మ్యాచ్‌లలో గెలిచిన సందర్భాలు లేవు. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షోయభ్ మాలిక్.. 86 మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో ఉండగా… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 73 విజయాలలో భాగస్వామిగా ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌తో పాటు అఫ్గానిస్తాన్ మాజీ సారథి మహ్మద్ నబీలు 70 విజయాలలో భాగస్వాములుగా ఉన్నారు.