West Indies qualify for Super 8: టీ 20 ప్రపంచకప్(T 20 World Cup)లో వెస్టిండీస్(WI)… సూపర్ 8కు దూసుకొచ్చింది. న్యూజిలాండ్(NZ)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన కరేబియన్లు… హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈ విజయంతో గ్రూప్ సీ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆతిథ్య వెస్టిండీస్ నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 149 పరుగులు చేసింది. అనంతరం వెస్టిండీస్ బౌలర్లు అద్భుతం చేశారు. ఈ లక్ష్యాన్ని కూడా కాపాడుకుని వరుసగా మూడో విజయం నమోదు చేశారు. లక్ష్య ఛేదనలో కివీస్ కేవలం 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్ సీ నుంచి విండీస్ సూపర్ 8కు చేరగా…. న్యూజిలాండ్ సూపర్ 8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
బౌలర్లదే పైచేయి
ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ టాస్ గెలిచిన న్యూజిలాండ్.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే విండీస్‌కు గట్టి షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే వికెట్ తీసిన బౌల్ట్… కివీస్‌కు శుభారంభం అందించాడు. దీంతో ఒక్క పరుగుకే వెస్టిండీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ ధాటిగా ఆడాడు. పూరన్ 12 బంతుల్లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండో వికెట్ 20 పరుగుల వద్ద విండీస్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే వెస్టిండీస్ మరో వికెట్ కోల్పోవడంతో కరేబియన్ల కష్టాల్లో పెరిగాయి. 21 పరుగుల వద్ద రస్టన్ ఛేజ్ అవుటయ్యాడు. దీంతో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగు జోడించారో రోమన్ పావెల్ కూడా వెనుదిరిగాడు. దీంతో 22 పరుగులకే విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో విండీస్ అసలు వంద పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. ఆరంభంలో వెస్టిండీస్‌పై చెలరేగిన కివీస్ బౌలర్లు…. తర్వాత కాడి వదిలేశారు. అయితే షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(Sherfane Rutherford) కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లోనే గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో రూథర్‌ఫోర్డ్ 68 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రూథర్‌ఫోర్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విండీస్ సేఫ్ జోన్‌లోకి వెళ్లింది. అకెల్ హోసైన్ 15 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 14 పరుగులు, రొమారియో షెపర్డ్ 13 రన్స్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది విండీస్
తడబడ్డ కివీస్
150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 136/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. డెవాన్ కాన్వే- ఫిన్ అలెన్ మొదటి వికెట్‌కు 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో ఓవర్ చివరి బంతికి కాన్వే వికెట్ పడింది. కాన్వాయ్ 8 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ఆరో ఓవర్ నాలుగో బంతికి ఫిన్ అలెన్ కూడా అవుటయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అలెన్ 26 పరుగులు చేశాడు. ఒక్క పరుగే చేసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర అవుట్‌తో కివీస్ కష్టాలు పెరిగాయి. అనంతరం డారిల్ మిచెల్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 63 పరుగులకే కివీస్ అయిదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. కానీ ఫిలిప్స్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. మిచెల్ శాంట్నర్ చివర్లో 12 బంతుల్లో 3 సిక్సర్ల సహాయంతో 21 పరుగులతో పోరాడినా అది సరిపోలేదు. వెస్టిండీస్ బౌలర్లు అద్భుతం చేశారు. అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. స్పిన్నర్ గుడ్కేశ్ మోతీ 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని చూడండి