VVS Laxman visits Tirumala Temple:
తిరుమల: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలకు లక్ష్మణ్ వచ్చారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయానికి విరాళం అందించారు. ఒక్క రోజు శ్రీవారి అలంకరణకు అయ్యే ఖర్చును వివిఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. దాదాపు 14 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టిటిడి ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి గమనించారు. తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం…
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి
సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.