Kris Srikkanth on Babar Azam: టీ 20 ప్రపంచకప్(T20 World Cup)లో పాకిస్థాన్(Pakistan) లీగ్ దశలోనే వెనుదిరగడంపై విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. పాక్ ఓటమికి కెప్టెన్ బాబర్ ఆజమే కారణమని ఆ దేశ అభిమానులు, మాజీలు మండిపడుతున్నారు. భారత మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్( Kris Srikkanth) కూడా బాబర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజం 122 అంతర్జాతీయ టీ 20 మ్యాచుల్లో కేవలం 4113 పరుగులే చేశాడని క్రిష్ గుర్తు చేశాడు. ఐసీసీ ఈవెంట్లలో బాబర్ మరింత ఘోరంగా విఫలమవుతున్నాడని… దానికి అతని గణాంకాలే నిదర్శనమని శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ ఈవెంట్‌లలో 16 మ్యాచ్‌లు ఆడిన బాబర్ కేవలం 517 పరుగులు మాత్రమే చేశాడని క్రిష్ అన్నాడు. 112 స్ట్రైక్ రేట్‌తో కేవలం 517 పరుగులు మాత్రమే చేయడం అతని పేలవ ప్రదర్శనకు నిదర్శనమని విమర్శించాడు. బాబర్ ఆజంను ఇంకా టీ 20 క్రికెట్‌లో కొనసాగించడం కరెక్ట్ కాదని. జిడ్డు బ్యాటింగ్ ఈ పొట్టి క్రికెట్‌లో పనికిరాదని క్రిష్ అన్నాడు. 122 టీ 20 మ్యాచుల్లో బాబర్ ఆజం 40.72 సగటుతో 4113 పరుగులు చేశాడు. ఇందులో అతను మూడు సెంచరీలు చేశాడు.
కెప్టెన్సీ కష్టమే
2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వైఫల్యంపై విమర్శలు చెలరేగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. బాబర్ ఆజమ్‌ను మరోసారి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత బాబర్‌పై వేటు పడింది. ఆ తర్వాత కూడా వరుస ఓటములు వెంటాడడంతో పాక్ కెప్టెన్‌పై వేటు పడింది. ఇప్పుడు మరోసారి టీ 20 ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో బాబర్‌పై కత్తి వేలాడుతోంది. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్‌ను నియమించవచ్చని తెలుస్తోంది. షాహీన్ అఫ్రిదీని మళ్లీ కెప్టెన్‌గా చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదే తొలిసారి కాదు…
టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి జట్లు లీగ్ దశలోనే వెనుదిరగడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. ఈ పెద్ద జట్లను ఓడించి పసికూనలుగా భావించిన జట్లు సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించి ఔరా అనిపించాయి. పాక్, లంక, కివీస్ జట్లు సూపర్ ఎయిట్ చేరడం ఖాయమని… టైటిల్ రేసులోనూ ఈ జట్లు ఉన్నాయని చాలామంది అంచనా వేశారు. అయితే టీ 20 ప్రపంచకప్‌లో గతంలోనూ అగ్రశ్రేణి జట్లు లీగ్ దశలోనే వెనుదిరిగిన చరిత్ర ఉంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా, సౌతాఫ్రికా లీగ్ దశలోనే వెనుదిరుగుతున్నాయి. పొట్టి ప్రపంచకప్ 2014లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి.
మరిన్ని చూడండి