Homeక్రీడలు..చెన్నై చేతులెత్తేసింది.. గుజరాత్ గెలిచింది

..చెన్నై చేతులెత్తేసింది.. గుజరాత్ గెలిచింది


csk vs gt ipl 2024 gujarat won the match : 

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ పక్కా ప్రణాళికతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన పోరులో చెన్నైని 35 పరుగుల తేడాతో ఓడించి కొద్దిపాటి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్ 103 (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్ లు), శుభ‌మన్ గిల్ 104 (55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీలతో  కదం తొక్కడంతో  మూడు వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 232 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులకే పరిమితమైంది.  చైన్నై జట్టులో డారిల్ మిచెల్ 63 (34బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), మొయిన్ అలీ 56: (6 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు)చెలరేగారు. చివర్లో  ధోనీ 26 (11 బంతుల్లో 3 సిక్సులు, ఒక ఫోర్) ప్రేక్షకులను అలరించినప్పటికీ.. అప్పటికే లక్ష్యం అందనంత ఎత్తుకి వెళ్లిపోవడంతో చెన్నై ఓటమి తప్పలేదు.  గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ అద్భుతమైన స్పెల్‌తో చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ జట్టు బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడుతూ భారీ షాట్లు కొడుతోన్న సమయంలో  3 కీలక వికెట్లు తీసి చెన్నైని కోలుకోని దెబ్బ తీశాడు.

గుజరాత్  బౌలింగ్ అదుర్స్

232 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై తమ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే తడబడింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర రనౌట్ అయ్యాడు. సందీప్ వారియర్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి తెవాతియాకు క్యాచ్ ఇచ్చి రహానే కూడా పెవిలియన్‌కు చేరాడు. ఈ సీజన్‌లో 550 కు పైగా పరుగులతో మాంచి ఫామ్ లో ఉన్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉమేశ్ యాదవ్ వేసిన ఆ తరువాతి ఓవర్లోనే క్యాచౌటయ్యాడు. ఇలా మూడు ఓవర్లలోనూ పది పరగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చెన్నైని  డారిల్ మిచెల్, మొయిన్ అలీలు ఆదుకున్నారు. నెమ్మదిగా క్రీజులో కుదురుకున్న వీళ్లద్దరూ.. ఒక్కసారి సెట్టయ్యాక సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయారు.  సందీప్, త్యాగి, నూర్ అహ్మద్ ఇలా గుజరాత్ బౌలర్లందరికీ బౌండరీలతో చుక్కలు చూపించారు. పది ఓవర్లకు చెన్నై 3 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.  వీరి ధాటికి ఇక చెన్నై గేమ్లోకి వచ్చేసింది అనుకున్న తరుణంలో మోహిత్ శర్మ వరుస ఓవర్లలో వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో చెన్నైకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

ఆశలు రేపిన జడ్డూ, దూబే

15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులతో నిలిచిన చెన్నై శిబిరంలో అప్పుడే క్రీజులోకొచ్చిన రవీంద్ర జడేజా, శివమ్ దూబేలు ఆశలు చిగురింపజేశారు.  కార్తీక్ త్యాగి వేసిన 16వ ఓవర్ లో శివమ్ దూబె వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా, జడేజా ఓ సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 19 పరుగులు వచ్చాయి. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై లక్ష్యం 70 పరుగులుగా మారడంతో చెన్నై శిబిరంలో గెలుపుపై ఆశలు రెకెత్తాయి. అయితే దూకుడుగా ఆడుతున్న దూబెను మోహిత్ శర్మ ఔట్‌ చేశాడు. 18వ ఓవర్లో రషీద్ ఖాన్ జడేజా, శాంట్నరులను ఔట్ చేయడంతో పాటు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చెన్నై ఓటమి ఖరారైంది.  చివర్లో ధోరీ మెరుపులు చూసేందుకు ఎదురు చూసిన క్రికెట్ అభిమానులకు ధోనీ ఆ ఫీస్ట్ కూడా అందించాడు. తనదైన శైలిలో మూడు సిక్సులు, ఒక ఫోర్ ద్వారా  11 బంతుల్లో 26 పరుగులు బాది గుజరాత్ గెలుపు మార్జిన్ ని తగ్గించాడు.  55 బంతుల్లో 104 పరుగులతో కెప్టెన్ నాక్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. 

ఈ విజయంతో పది పాయింట్లతో గుజరాత్ పాయింట్ల టేబుల్‌లో ఎనిమిదో స్థానానికి ఎగబాకగా సీఎస్‌కే నాలుగో స్థానంలోనే కొనసాగుతోంది. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments