International Womens Day 2024: ఆమె ఖ్యాతిగాంచని రంగం లేదు. సాధించని ప్రగతి లేదు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా మలచుకుని విభిన్న వేదికలపై మహిళాలోకం వెలుగులీనుతోంది. స్వతంత్ర భారతంలో అతివల ప్రస్థానం ఆకాశమే హద్దుగా సాగుతోంది. వలసపాలన నుంచి విముక్తి పొందిన భారతావనిలో వనితాలోకం వడివడిగా పురోగమిస్తోంది. ఇందుగలరు అందులేరని సందేహం లేకుండా అతివలు అన్ని రంగాల్లో విజయకేతనం ఎగురవేస్తున్నారు. స్వతంత్ర భారతావనిలో రాజకీయ, ఆర్థిక, వ్యాపార, క్రీడా, సినీరంగాల్లో మహిళలు చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు సాధించారు..సాధిస్తున్నారు.
ఒలింపిక్స్(Olympics), కామన్‌వెల్త్ పోటీల్లో మన దేశానికి ఇప్పటివరకు అతివలే అధిక పతకాలు తెచ్చిపెట్టారు. పీవీ సింధు(Pv Sindhu) బ్యాడ్మింటన్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతకాలను ముద్దాడి శిఖరస్థాయి కీర్తిని ఆర్జించారు. తాజా కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణభేరి మోగించారు. రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన తొలి మహిళగా తెలుగుతేజం సింధు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన ఆమె.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012, సెప్టెంబరు 21న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకొని మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.
బ్యాడ్మింటన్‌లో మరచిపోలేని మరో పేరు సైనా నెహ్వాల్(Saina Nehwal). ఒలింపిక్స్‌లో కాంస్యం, 2010, 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు సహా ఇప్పటివరకు 24 టైటిళ్లను సాధించారు. కేంద్ర ప్రభుత్వం సైనాను అర్జున, పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. భారత్ తరఫున ప్రపంచంలోనే నెం.1 ర్యాంక్ సాధించిన తొలి క్రీడాకారిణి సైనా.
టెన్నిస్‌లో సానియా మీర్జా చరిత్ర లిఖించారు. డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచారు. సానియా మీర్జా తన టెన్నిస్ ఆటతోనే కాకుండా.. అందంతోనూ ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకుంది. ఇండియాలో టెన్నిస్ అంతలా పాపులర్ కావడానికి ఓ కారణం సానియా మీర్జా. మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు సానియా మీర్జా(Sania Mirza) ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
భారత బాక్సింగ్ చరిత్రలో మేరీకోమ్ ఓ ప్రభంజనం. అటు మన తెలుగమ్మాయి నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో తాజా సంచలనంగా దూసుకుపోతున్నారు.
ఇక టీమిండియా కెప్టెన్ మిథాలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పురుషు క్రికెట్ లో సచిన్ ఎలాగో..మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ అలా. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులను తిరగరాసింది. వన్డేల్లో 6000 పరుగులు మార్కును అధిగమించిన ఏకైక మహిళ క్రికెటర్. అలాగే, టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్ కు రెండు సార్లు నడిపించిన ఏకైక భారత క్రికెట్ కెప్టెన్.
గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక(Dronavelli Harika) తమ మేధోసంపదతో రెండు దశాబ్దాలుగా ప్రపంచ చెస్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పదిహేను నెలల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో హంపి స్వర్ణ పతకాన్ని గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
ఇక వెన్నం జ్యోతిసురేఖ సుప్రసిద్ధ అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి. ఈమె ప్రపంచ కప్ లో కాంపౌండ్ విలువిద్యలో వ్యక్తిగత, మిక్స్ డ్ టీం పోటీలలో స్వర్ణ పతకాలను సాధించింది. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లు మరియు ఆసియా క్రీడలలో కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో పలు బంగారు పతకాలను గెలుచుకుంది. 2017లో భారతదేశం యొక్క రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును గెలుచుకుంది. దక్షిణ భారతదేశం నుండి ఈ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు వెన్నం జ్యోతిసురేఖ.
మరిన్ని చూడండి