IPL 2024 Qualifier 2: ఐపీఎల్ 2024 (IPL 2024) లో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. ఐపీఎల్ సెమీఫైనల్ గా భావించే మ్యాచ్ కు హైదరాబాద్(SRH).. రాజస్థాన్ రాయల్స్(RR) రెడీఅయ్యాయి, విధ్వంసకర బాటింగ్ లైన్ అప్ ఉన్న హైద్రాబాద్, పటిష్ట బౌలింగ్ లైన్ అప్ ఉన్న రాజస్థాన్ మధ్య భీకర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరాలన్న పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. ట్రోఫీ కలకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఈ రెండు జట్లు మైదానంలో చిన్నపాటి యుద్ధం చేయనున్నాయి. బంతి బంతికి ఉత్కంఠ పెరిగిపోయే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మొత్తం ఐపిఎల్ సీజన్లలోనే అత్యుత్తమ బ్యాటర్లుగా రాణిస్తున్న ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మలు, అత్యుత్తమ బౌలర్లు అయిన స్పిన్ మాంత్రికులు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌లలో ఎలా ఎదుర్కొననున్నారు అన్నది ఈ రోజు తేలనుంది. తొలి క్వాలిఫయర్‌లో కలకత్తా(KKR) చేతిలో పరాజయం పాలైన హైదరాబాద్ ఈ మ్యాచ్లో విజయంపై కన్నేసింది.
బలంగా హైదరాబాద్
ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇప్పటివరకు అద్భుత ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఈ సీజన్‌లో ట్రావిశ్ హెడ్ 533 పరుగులు చేయగా , అభిషేక్ 14 మ్యాచ్‌ల్లో 470 పరుగులు చేశాడు. మరీ భాగస్వామ్యంలో 96 బౌండరీలు, 72 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. దీంతో రాజస్థాన్‌పై కూడా వీరిద్దరూ అద్భుతాలు చేయగలిగే అవకాశం ఉంది. అలాగే హెన్రిచ్ క్లాసెన్ కూడా ఈ సీజన్లో 413 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ కూడా కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేశాడు.
యశస్విపైనే బాధ్యత
ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆర్‌సిబిని ఓడించింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 8 మ్యాచ్‌లు గెలిచింది. అయితే నెట్ రన్ రేట్ ప్రకారం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ దిగ్గజ ఆటగాడు జోస్ బట్లర్ అందుబాటులో లేకపోవటం రాజస్థాన్ కు గట్టి దెబ్బే, అయితే చివరి మ్యాచ్‌లో కాడ్మోర్, యశస్వి మంచి ఆట కనపరిచేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తారు. గత మ్యాచ్ లో ఆర్‌సీబీపై యశస్వి 45 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కాడ్మోర్ 20 పరుగుల వద్ద ఔటయ్యాడు.
హైదరాబాద్ జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ , ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ , భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్ , రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఉపేంద్ర యాదవ్ , ఝాతవేద్ సుబ్రమణ్యన్, సన్వీర్ సింగ్, విజయకాంత్ వియాస్కాంత్, ఫజల్హాక్ ఫరూకీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్ మరియు మయాంక్ అగర్వాల్.
రాజస్థాన్ జట్టు : సంజు శాంసన్ , అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాండ్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్ మరియు తనుష్ కోటియన్.
మరిన్ని చూడండి