IPL Match Between Mumbai And Gujarat: అరివీర భయంకర, శత్రు దుర్భేద్యమైన టీం ముంబయ్ ఇండియన్స్. ముంబై టీం పోరాటం చూస్తే విజయానికి కూడా ముచ్చటేస్తుందేమో… అందుకే ట్రోఫీలు వచ్చి ఈ నీలిరంగు జెర్సీ ఒడిలో వాలిపోతాయి. 5 టైటిళ్ల విజేత, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీం ముంబయ్ ఈ సారి ఐపీయల్లో తన వేట మొదలుపెట్టింది. అయితే అది కూడా ఐపీయల్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్ లోనే కప్ కొట్టిన గుజరాత్ టైటాన్స్‌తో. ఈ ఆదివారం సాయంత్రం 7.30 నిమిషాలకు అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఇంతటి ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ అంటే ఏరేంజ్ హైటెన్షన్ ఉండనుంది. రెండు టీంల మధ్య వ్యత్యాసం ఏంటి అంటే…
ఆసక్తికరం
ఈ జట్ల మధ్య మ్యాచ్‌కంటే ముందు ఈ సారి అందర్నీఆకర్షించిన అంశం ముంబై కెప్టెన్సీ మార్పు. 5 సార్లు కప్ అందించిన రోహిత్ శర్మని మార్చి హార్ధిక్ పాండ్యని కెప్టెన్ చేశారు. అయితే ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ని ఛాంపియన్‌గా నిలపడం, గతంలో ముంబై జట్టులోనే ఆడడంతో పాండ్యా జట్టుతో కలిసిపోతాడని యాజమాన్యం చెబుతోంది. టీంని సమర్ధవంతంగా నడపించగలడని ముంబై అంటోంది. అభిమానులు ఇది ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.
ముంబై బలం
ఇక ముంబై టీం అంటేనే బలానికి పేరు. ఏ టీమ్‌ని ఐనా వణికించే బలమైన బ్యాటింగ్ లైనప్ ముంబై సొంతం. రోహిత్‌శర్మ, ఇషాన్‌కిషన్, సూర్యకుమార్‌యాదవ్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్‌వర్మ. ఇక కెప్టెన్ పాండ్యా ఉండనే ఉన్నాడు. గుజరాత్ బౌలర్లనే కాదు లీగ్‌లో ఇప్పటికే అన్ని టీమ్ బౌలర్లని సమర్దవంతంగా ఎదుర్కొన్న ఆటగాళ్లు వీరు. ప్రత్యర్ధి మీద మెదటి బంతినుంచే డామినేషన్ చేయడం ముంబై శైలి. రోమారియో షెఫర్డ్, శ్రేయస్ గోపాల్,మహ్మద్ నబీ లతో చివరి వరకు బ్యాట్ ఝులిపించగలరు. ఇలా బ్యాటింగ్ శక్తివంతంగా కనిపిస్తోంది.
ఇక బౌలింగ్ విషయానికొస్తే ప్రధాన బౌలర్ బూమ్రా ఉన్నాడు. లూక్‌వుడ్, కుమార్ కార్తికేయ, నువాన్ తుషార, కొయెట్జీ ఉన్నారు. స్పిన్ విభాగంలో పీయూష్ చావ్లా, నబీ ఆ బాధ్యతలు మోయనున్నారు. ప్రధానంగా వీరి బలం బ్యాటింగ్ అని చెప్పొచ్చు. కానీ సమష్టిగా రాణిస్తే వీరే ముంబై ఆయుధాలవుతారు.
గుజరాత్ కా స్వాగ్
ఇక గుజరాత్ విషయానికొస్తే, ఒకసారి విజేత, గత సీజన్ రన్నరప్. కానీ, అది హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో అవ్వడం, ఈ సారి పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో ఆ బాధ్యత అంతా ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ మీదే పడింది. జట్టంతా కలిసి ఆడటం టైటాన్స్ ప్రధాన బలం. కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్ల లాంటి మ్యాచ్ విన్నర్లు, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ లాంటి బ్యాటర్లతో గుజరాత్ బలంగానే ఉంది. కానీ పాండ్యా లాంటి ఆటగాడు లేకపోవడం లోటు అని చెప్పొచ్చు. ఇక తెవాటియా, రషీద్‌ఖాన్ లోయరార్డర్‌లో పరుగులు చేయగలరు. కానీ ఎక్కువ బాధ్యతంతా టాపార్డర్‌పైనే ఉంది. వీరే కీలకం గుజరాత్‌కి.
బౌలింగ్ విషయంలో గుజరాత్… ఉమేశ్‌యాదవ్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగిలు ఉండగా రషీద్‌ఖాన్, విజయ్ శంకర్ లు వికెట్ టేకర్‌లుగా ఉండనున్నారు. సరిపడినన్ని బౌలింగ్ వనరులు కనిపిస్తున్నాయి. ఇక వీరిని గిల్ ఎలా ఉపయోగించుకొంటాడన్న దానిమీద విజయం ఆధారపడి ఉంటుంది. కెప్టెన్‌గా శుభ్‌మన్‌గిల్‌కి ఇదే మొదటిసారి కావడం కూడా ఎలా ముందుకు తీసుకెళ్తాడు టీంను అన్న ఉత్కంఠ కలుగుతోంది. ఇక మరోసారి టైటిల్ కొట్టాలని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో ముంబైపై గెలిస్తే ఆ ఆత్మవిశ్వాసం మరింత బలపడతుందని గుజరాత్ ఆటగాళ్లు భావిస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ మజాయే వేరనుకొంటున్నారు రెండు జట్ల అభిమానులు. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ కి అచ్చొచ్చిన మైదానం కావడంతో గిల్ సెంచరీఖాయమని గుజరాత్ ఫ్యాన్స్, మాతో అంత ఈజీకాదని ముంబై ఫ్యాన్స్ మాట్లాడుకొంటున్నారు. మరి ఈ ఛాంపియన్స్ ఆట ఎలా ఉంటుందో చూడాలి అంటే ఇంకొన్నిగంటలు ఆగాల్సిందే.
మరిన్ని చూడండి