ICC Womens T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచకప్ కు సమయం సమీపిస్తోంది. తొలిసారి కప్పు సాధించాలని భారత జట్టు.. తమ జైత్రయాత్ర సాగించాలని ఆస్ట్రేలియా… తమ పోరాటానికి ఫలితం దక్కాలని న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇలా ప్రతీ జట్టూ పొట్టి ప్రపంచకప్ కోసం సిద్ధమవుతోంది. ఆట ఆరంభానికి సమయం దగ్గరవుతున్నా కొద్దీ భారత జట్టుపై అంచనాలు పతాకస్థాయికి చేరుతున్నాయి. అయితే టీ 20 క్రికెట్ అంటేనే దూకుడుగా ఆడే బ్యాటర్లు మరింత చెలరేగుతారు. అయితే టీ 20 ప్రపంచకప్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం..
సుజీ బేట్స్:
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సుజీ బేట్స్ మహిళల క్రికెట్ చరిత్రలో అత్యంత డైనమిక్ బ్యాటర్‌గా గుర్తింపు పొందింది. టీ 20 ప్రపంచకప్ చరిత్రలో 1,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక క్రీడాకారిణి ఆమె. పొట్టి ప్రపంచకప్ లో బేట్స్ 36 మ్యాచ్‌ల్లో 114.13 స్ట్రైక్ రేట్‌తో 1,066 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో ఆమె ఎనిమిది అర్ధసెంచరీలు చేయగా అత్యధిక స్కోరు 94 నాటౌట్.
మెగ్ లానింగ్
మహిళల T20 ప్రపంచ కప్ లో తరచుగా వినపడే పేరు ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్. టీ 20ల్లో సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో మెగ్ లానింగ్ కూడా ఉంది. 35 T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఆమె 112.72 స్ట్రైక్ రేట్‌తో 992 పరుగులు చేసింది. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి, అత్యధిక స్కోరు 126.
అలిస్సా హీలీ
ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన అలిస్సా హీలీకూడా దూకుడైన బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన వికెట్ కీపిన్ నైపుణ్యంతోపాటు అద్భుతమైన బ్యాటింగ్ చేయగల ప్లేయర్ గా హీలీకి గుర్తింపు ఉంది.
టీ 20 ప్రపంచ కప్ లో 39 మ్యాచ్‌ల్లో హీలీ 128.37 స్ట్రైక్ రేట్‌తో 941 పరుగులు చేసింది. ఇందులో ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 83.
స్టాఫానీ టేలర్
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ అయిన స్టాఫానీ టేలర్ 31 మ్యాచ్‌లలో 94.68 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 926 పరుగులు చేసింది.ఇందులో ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి.ఆమె అత్యధిక స్కోరు 59.
షార్లెట్ ఎడ్వర్డ్స్
ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్ కూడా దూకుడైన బ్యాటింగ్ తో అలరించారు. టీ 20 ప్రపంచకప్ లో 24 మ్యాచ్‌లలో, ఎడ్వర్డ్స్ 103.92 స్ట్రైక్ రేట్‌తో 768 పరుగులు చేసింది.ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి.ఆమె అత్యధిక స్కోరు 80.
మిథాలీ రాజ్
టీమిండియాకు ఎన్నో మధురమైన విజయాలను అందించిన మిథాలీ రాజ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. టీ 20 ప్రపంచకప్పులో మొత్తం 24 మ్యాచులు ఆడిన మిథాలీ 726 పరుగులు చేసింది. ఇందులో అయిదు అర్థ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 57.
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 కేవలం ఒక వారం మాత్రమే ఉంది. యూఏఈలో అక్టోబర్ మూడున పొట్టి ప్రపంచకప్ ఆరంభం కానుంది. దుబాయ్, షార్జాల్లోని రెండు స్టేడియాల్లో ఈ మ్యాచులు జరగనున్నాయి.
మరిన్ని చూడండి