ICC Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్(ICC Women’s T20 World Cup)లో ఇంగ్లాండ్(England) విజయ పరంపర కొనసాగుతోంది.ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న సంకల్పంతో ఉన్న బ్రిటీష్ జట్టు.. దక్షిణాఫ్రికా(South Africa )పై ఘన విజయం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో ప్రొటీస్‌ను మట్టికరిపించి.. పొట్టి ప్రపంచ కప్‌లో రెండో విజయం నమోదు చేసి సెమీస్ అవకాశాలను మరింత పెంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 124 పరుగులే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని కేవలం మూడే వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది.
రాణించని దక్షిణాఫ్రికా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. తొలి వికెట్‌కు ప్రొటీస్ జట్టు ఓపెనర్లు వోల్వార్ట్, బ్రిట్స్ 31 పరుగులు జోడించారు. తొలి వికెట్ కోల్పోయిన తర్వాత కూడా దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాగానే రాణించారు. 13 ఓవర్లలో 71 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ప్రొటీస్ మంచి స్థితిలోనే నిలిచింది. అనెకె బాష్ 18 పరుగులు, మరిజేన్ కాప్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అయితే ఆ తర్వాత మిగిలిన బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. బ్రిటీష్ బౌలర్లలో సోఫీఎకిల్‌స్టోన్ 2 వికెట్లు, సారా గ్లెన్, చార్లీ డీన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ …. 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాట్ సీవర్ 36 బంతుల్లో ఆరు ఫోర్లతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సీవర్ పోరాటంతో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా నడిచింది. డానీ వ్యాట్ కూడా ధాటిగా ఆడింది. కేవలం 43 బంతుల్లో నాలుగు ఫోర్లతో 43 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు జరిగినా ఇంగ్లాండ్ మ్యాచ్‌పై పూర్తి పట్టు ప్రదర్శించింది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు మరింత పెరిగాయి.
రేపే శ్రీలంకతో భారత్ పోరు
టీ 20 ప్రపంచకప్‌లో కీలక పోరుకు భారత జట్టు సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత భారత్ సెమీస్ రేసులో నిలిచింది. లంకతో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించి సె(Team India) మీస్ రేసులో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది. అయితే ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను ఓడించి శ్రీలంక(Srilanka) విజయం సాధించడం టీమిండియాను కలవరపరుస్తోంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టాపార్డర్ విఫలం కావడం కూడా భారత్‌ను ఆందోళన పరుస్తోంది. అయితే శ్రీలంకను తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదని విధ్వంసకర ఓపెనర్ షెఫాలి వర్మ పేర్కొంది. శ్రీలంక జట్టు ఇప్పుడు చాలా బలంగా మారిందని.. ఆసియా జట్టులో ఆ జట్టు ప్రదర్శన చూశామని తెలిపింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మ్యాచ్ అన్నింటికంటే కీలకమని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. వంద శాతం ప్రదర్శన ఇచ్చి మ్యాచులు గెలుస్తామని వెల్లడించింది.
మరిన్ని చూడండి