RCB Retention List For IPL 2025: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 సీజన్ రిటెన్షన్ గడువు ముగియనుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబైకే ఆడాలని, అతడికి కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తుండగా.. విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆర్సీబీలోనే కొనసాగాలని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలని రన్ మెషీన్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్ లో టాపార్డర్ లో రావాలని అతడి బ్యాటింగ్ చూడాలని మహీ ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే వచ్చే సీజన్ ధోనీకి చివరికి అవుతుందేమోనని ప్రచారం జరుగుతోంది.
కింగ్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
సీజన్లు గడుస్తున్నా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఎంతో క్రేజ్ ఉన్న ఆర్సీబీకి కప్ అందించలేకపోవడంతో విరాట్ కోహ్లీ RCB కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫ్యాన్స్ మాత్రం అతడినే కెప్టెన్ గా కోరుకుంటున్నారు. IPL 2025 రిటెయిన్ ఆటగాళ్ల జాబితా విడుదలకు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా కీలక విషయాన్ని రిపోర్ట్ చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మళ్లీ కెప్టెన్ అవుతాడని అంచనా వేసింది. దాంతో ఆర్సీబీ గ్యారంటీ రిటెన్షన్ జాబితా (RCB Retention List)లో కోహ్లీ చేరిపోయాడు.
విల్ జాక్స్, యశ్ దయాల్ కు మరో ఛాన్స్
అత్యధిక ఫాలోయర్లు కలిగి ఉన్న కింగ్ కోహ్లీ ఆర్సీబీకి ఆడటం ఆ జట్టుకు ప్లాస్ పాయింట్. కోహ్లీతో పాటు ఆర్సీబీ అట్టిపెట్టుకునే ప్లేయర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ ఒకడు. ఈ రైట్ ఆర్మ్ సీమర్ ఇటీవల భారత బౌలింగ్ అటాక్‌లో కీలకంగా మారాడు. వీరితో పాటు ఆర్సీబీ రీటెయిన్ జాబితాలో విల్ జాక్స్, యశ్ దయాల్ కు ఛాన్స్ ఉందని టీఓఐ కథనం సారాంశం.
ఆర్సీబీ మేనేజ్ మెంట్ ఈసారైనా కప్పు నెగ్గి తమ దండయాత్రను విజయవంతం చేయాలని భావిస్తోంది. దాంతో విదేశీ ఆటగాడు విల్ జాక్స్ వైపు మొగ్గు చూపనుంది. 25 ఏళ్ల విల్ జాక్స్ ఇప్పటివరకు 8 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడినా ఓ శతకం బాదేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 175.57 కాగా, బ్యాటింగ్ యావరేజీ 32.86తో ఉన్నాడు. మెరుపు బ్యాటింగ్ చేయగలగడం విల్ జాక్స్ ను రిటెయిన్ చేసుకునేందుకు కలిసొస్తుంది.
బెంగళూరుకు ఆడుతున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాల్ ఆర్సీబీకి కీలక ఆటగాడిగా మారుతున్నాడు. గత సీజన్ లో 14 మ్యాచ్ లాడిన యశ్ దయాల్ 15 వికెట్లతో సత్తాచాటాడు. భారత్ తరఫున అరంగేట్రం చేయని యశ్ దయాల్ ఈ లీగ్ లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేయడం ప్లస్ పాయింట్. దాంతో ఆర్సీబీ మేనేజ్ మెంట్ ప్లాన్స్ లో యశ్ దయాల్ ఉంటాడని ఆ రిపోర్ట్ చెబుతోంది. మరికొన్ని గంటల్లో ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ ఫ్రాంచైజీలు విడుదల చేయనున్నాయని తెలస్తోంది.
మరిన్ని చూడండి