Nikhil Kamat: వారసత్వాన్ని కొనసాగించడానికి పిల్లలను కలిగి ఉండటం అవసరమని తాను భావించడం లేదని జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ అన్నారు. ఇటీవలి తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో పిల్లలు, వారసత్వం వంటి విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. పిల్లలను కనడం ద్వారా తన జీవితంలోని రెండు దశాబ్దాలను “బేబీ సిట్టింగ్” కోసం వ్యర్థం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. పిల్లలు పెద్దయ్యాక, వృద్ధాప్యంలో తమను బాగా చూసుకుంటారనే స్వార్థంతో పిల్లలను కని, వారి కోసం తమ జీవితంలోని 20 ఏళ్లను వేస్ట్ చేయడం అనసవరమని తన అభిప్రాయమన్నారు.
పిల్లలు వద్దనుకోవడానికి అదే కారణం
పిల్లల పెంపకం కోసం జీవితంలోని అత్యంత విలువైన 20 ఏళ్లను వ్యర్థం చేసుకోవడం సరైన పని కాదని తన ఉద్దేశమని కామత్ చెప్పారు. ‘‘ఒకవేళ కష్టపడి పిల్లలను పెంచిన తరువాత.. మనం ఆశించినట్లు వృద్ధాప్యంలో వారు మనల్ని సరిగా చూసుకుంటే అదృష్టమే. కానీ, అలా కాకుండా, 18 ఏళ్లు నిండగానే వారు.. గుడ్ బై అని చెప్పి మనల్ని వదిలేసి వెళ్తే పరిస్థితి ఏంటి?’’ అని నిఖిల్ కామత్ ప్రశ్నించారు. వారసత్వం అనే ఆలోచన గురించి మాట్లాడుతూ, ఈ ఆలోచనపై తనకు నమ్మకం లేదన్నారు. ‘‘మనల్ని మనం ఎక్కువ ముఖ్యమని భావిస్తాం. నువ్వు పుట్టావు. ఈ భూమ్మీదున్న అన్ని జంతువుల్లాగే కొన్నాళ్ల తరువాత చచ్చిపోతావు, ఆ తర్వాత నువ్వు ఎవ్వరికీ గుర్తుండవు’’ అని వ్యాఖ్యానించారు. మనల్ని మనం చనిపోయిన తరువాత అంతా గుర్తుంచుకోవాలి అనుకోవడం కూడా అర్థం లేనిదని కామత్ వ్యాఖ్యానించారు. ఈ భూమిపై ఉన్నంతవరకు అందరితో మంచిగా ఉంటూ, మంచి జీవనం సాగిస్తే చాలు అన్నారు.
బ్యాంక్ ల్లో డబ్బులు దాచుకోవడంపై..
గతంలో నిఖిల్ కామత్ మరణంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రతి ఒక్కరూ మరణం ప్రాముఖ్యతను గ్రహించాలి. మరణం భావనను అర్థం చేసుకోవాలి. నా వయస్సు 37 సంవత్సరాలు. ఒక భారతీయుడి సగటు ఆయుర్దాయం 72 సంవత్సరాలు అనుకుంటే, నాకు ఇంకా 35 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవడంలో అర్థం లేదు. ఇన్నాళ్లు నేను సంపాదించిన మొత్తాన్ని, నెక్స్ట్ 20 ఏళ్లు సంపాదించే మొత్తాన్ని బ్యాంక్ ల్లో దాచిపెట్టడంలో అర్థం లేదు. వాటిని నచ్చినట్లుగా, నేను నమ్మిన విషయాలకు ఖర్చు పెట్డడానికి ఇష్టపడతాను. ఆ డబ్బును అలా బ్యాంకు లేదా సంస్థకు వదిలేయడం కంటే… దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది’’ అని నిఖిల్ కామత్ వివరించారు.