Homeఆర్థికంసెక్షన్ 80TTB ప్రయోగిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ.50 వేలు పన్ను ఆదా

సెక్షన్ 80TTB ప్రయోగిస్తే సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ.50 వేలు పన్ను ఆదా


Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను కట్టే విషయంలో సాధారణ ప్రజల కంటే 60 ఏళ్లు దాటిన (సీనియర్‌ సిటిజన్లు) వ్యక్తులకు కొన్ని వెసులుబాట్లు, అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఆదాయ పన్ను చట్టంలోకి సెక్షన్ 80TTB అలాంటిదే. సీనియర్ సిటిజన్ల వయస్సును గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా కొంత ఊరట కల్పించడానికి ఆదాయ పన్ను చట్టంలోకి సెక్షన్ 80TTBని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఈ సెక్షన్‌ను ప్రకటించింది.

వివిధ నగదు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై 50 వేల రూపాయలను సెక్షన్‌ 80TTB ఆదా చేస్తుంది. భారతీయ నివాసితులై, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తారు.

సెక్షన్ 80TTB అంటే ఏంటి? ‍‌(What is Section 80TTB?)
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించడం సెక్షన్ 80TTB ప్రధాన లక్ష్యం. వివిధ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ.50,000 తగ్గింపును (Tax deduction) ఈ సెక్షన్‌ అందిస్తుంది. 

సెక్షన్ 80TTB పరిధి
బ్యాంక్‌లు, పోస్టాఫీస్‌లో సేవింగ్స్‌ అకౌంట్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ అకౌంట్‌ డిపాజిట్లు, రికరింగ్ అకౌంట్‌ డిపాజిట్లు, బాండ్‌లు/NCDలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) కింద చేసే డిపాజిట్‌లు సహా వివిధ రకాల డిపాజిట్‌ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 మినహాయింపును సీనియర్ సిటిజన్‌లు క్లెయిమ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ సెక్షన్ కింద TDS మినహాయింపు కూడా పొందొచ్చు. సెక్షన్ 80TTB ఇచ్చిన మినహాయింపు ప్రకారం, సెక్షన్ 194A కింద, సీనియర్‌ సిటిజన్లకు వచ్చే వడ్డీ ఆదాయంపై TDS పరిమితిని రూ. 50,000 వరకు పొడిగించారు. అంటే, రూ. 50,000 వరకు ఉన్న వడ్డీ ఆదాయంపై బ్యాంకులు, పోస్టాఫీస్‌లు TDS కట్‌ చేయలేవు.

సీనియర్ సిటిజన్ల అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ. దీనికి సంబంధించి వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో డబ్బును సీనియర్‌ సిటిజన్లకు అందుబాటులో ఉంచడానికి పన్ను మిహాయింపు పరిమితిని రూ. 50,000 చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు, పన్ను లేని కారణంగా ఆదా అయిన డబ్బును మళ్లీ పెట్టుబడిగా వినియోగిస్తారన్న ఆలోచన కూడా సెక్షన్ 80TTBని తీసుకురావడం వెనకున్న మరో కారణం.

సెక్షన్ 80TTA ఎవరి కోసం?
సెక్షన్ 80TTA – సెక్షన్ 80TTB మధ్య తేడాను పన్ను చెల్లింపుదార్లు గుర్తించాలి. ఈ రెండు సెక్షన్లు రెండు వేర్వేరు వర్గాలకు వర్తిస్తాయి. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు (Individuals), హిందు అవిభాజ్య కుటుంబాలు (HUFs) సెక్షన్ 80TTA పరిధిలోకి వస్తాయి. పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ మాత్రమే ఈ సెక్షన్‌ కిందకు వస్తుంది. దీని కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో, 10 వేల రూపాయల వరకు వడ్డీ ఆదాయ పరిమితి లభిస్తుంది. అంటే, రూ. 10,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను ఉండదు.

మరో ఆసక్తికర కథనం: ఈ ఎఫ్‌డీలపై తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు, గ్యారెంటీగా!



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments