Pradhan Mantri Awas Yojana 2.0: పట్టణ ప్రాంతాల్లో నివశించే ఆర్థికంగా వెనుకబడిన (EWS), అల్ప ఆదాయ (LIG) & మధ్య తరగతి (MIG) కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు, భారత ప్రభుత్వం, “ప్రధాన మంత్రి ఆవాస్ యోజన”ను ప్రారంభించింది. ఇప్పుడు, ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్’ రెండో దశ (PMAY-U 2.0) కూడా ప్రారంభమైంది. లబ్దిదార్లు నివశించే ప్రాంతాన్ని బట్టి పీఎంఏవై – గ్రామీణ్ (PMAY-G) లేదా పీఎంఏవై – అర్బన్ (PMAY-U) కింద ప్రయోజనాలు పొందొచ్చు.
PMAY 2.0 ఫేజ్ కింద, వచ్చే ఐదేళ్లలో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. కలల ఇంటిని తక్కువ ఖర్చులో నిర్మించుకోవడం, కొనుగోలు చేయడం, అద్దెకు తీసుకోవడంలో ఈ కేంద్ర ప్రభుత్వ పథకం సాయం చేస్తుంది.
నాలుగు కేటగిరీలుగా పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలు
పీఎంఏవై-అర్బన్ 2.0 కింద, భారత ప్రభుత్వం రూ. 2.30 లక్షల కోట్లు కేటాయిస్తుంది. పథకం మొదటి దశలో 1.18 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించింది. ఇప్పటికే 85.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. పీఎంఏవై రెండో దశలో, ఈ పథకం ప్రయోజనాలు నాలుగు కేటగిరీలు క్రింద అర్హులైన లబ్ధిదారులకు అందుతాయి. ఈ నాలుగు కేటగిరీలు…
1. బెనిఫియరీ లెడ్ కన్‌స్ట్రక్షన్ (Beneficiary Led Construction – BLC)
2. అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్ (Affordable Housing in Partnership – AHP)
3. అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ (Affordable Rental Housing – ARH)
4. ఇంట్రస్ట్ సబ్సిడీ స్కీమ్ (Interest Subsidy Scheme – ISS)
BLC: సొంత స్థలంలో 45 చదరపు మీటర్ల వరకు ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2.25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం అందుతుందో ఇంకా నిర్ణయించలేదు. ఈ స్కీమ్ అర్హత కింద, కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలు లోపు ఉండాలి. రూ. 3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలను EWSగా పరిగణిస్తారు.
AHP: ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్థాయిలో హౌసింగ్ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తారు. ఈ కేటగిరీలో EWS & LIG కుటుంబాలు మాత్రమే ఇళ్లు కొనుగోలు చేయగలవు. ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2.25 లక్షలు, రాష్ట్రం నుంచి రూ.50 వేలు అందుతాయి. ఇందులో, EWS కుటుంబ వార్షిక ఆదాయ మూడు లక్షల రూపాయల లోపు ఉండాలి. LIG కేటగిరీ కింద కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలు – రూ. 6 లక్షల లోపు ఉండాలి.
ARH: ఈ కేటగీరీలో, ఇళ్లు నిర్మించి అద్దెకు ఇస్తారు. ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి డబ్బు లేని వారి కోసం ఉద్దేశించిన కేటగిరీ ఇది. ఇందులో, ఒక్కో యూనిట్‌కు చదరపు మీటరుకు రూ.3000 చొప్పున కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ (టీఐజీ)ను, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు చదరపు మీటరుకు రూ.2000 ఇస్తుంది.
ISS: ఇందులో, రూ. 35 లక్షల వరకు ఖరీదైన ఇళ్లకు రూ. 25 లక్షల వరకు గృహ రుణం తీసుకునే ప్రత్యేక సౌకర్యం ఉంటుంది. 120 చదరపు మీటర్లు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఇంటిని కొనుగోలు చేసినవాళ్లకు రూ. 1.80 లక్షల వరకు రుణ రాయితీ లభిస్తుంది. EWS, LIG, MIG లబ్దిదారులు దీని నుంచి ప్రయోజనం పొందుతారు. రూ. 6 లక్షలు – రూ. 9 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలు MIG కిందకు వస్తాయి.
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
PMAY 2.0 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అవసరమైన డాక్యుమెంట్లు…
1. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్
2. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్‌లు
3. యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ ఖాతా సమాచారం
4. ఆదాయ ధృవీకరణ పత్రం
5. కుల ధృవీకరణ పత్రం
6. భూ యాజమాన్య రుజువు పత్రం
ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి
1. దరఖాస్తు చేయడానికి, www.https://pmay-urban.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. ‘Apply for PMAY-U 2.0’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
3. మీ వార్షిక ఆదాయం, చిరునామా, ఇతర వివరాలను అందించండి & డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
4. OTPతో మీ ఆధార్‌ను ప్రామాణీకరించండి.
5. ఆ తర్వాత మీ దరఖాస్తు ఫారాన్ని సమర్పించండి.
మీరు సమర్పించిన దరఖాస్తు ఫారాన్ని పోర్టల్‌లో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?