Homeఆర్థికంమారని పేటీఎం తీరు, షేర్‌హోల్డర్లకు ఈ రోజు కూడా దబిడిదిబిడే!

మారని పేటీఎం తీరు, షేర్‌హోల్డర్లకు ఈ రోజు కూడా దబిడిదిబిడే!


Paytm Share Price Down: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL) మీద ఆంక్షల ప్రభావం పేటీఎం షేర్ల మీద బలంగా కనిపిస్తోంది. ఈ స్టాక్‌ ఈ రోజు (శుక్రవారం 02 ఫిబ్రవరి 2024) కూడా 20% పతనంతో లోయర్‌ సర్క్యూట్‌లో లాక్‌ అయింది.  

ఈ నెల 29 (ఫిబ్రవరి 29) తర్వాత కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, వాలెట్లు & ఫాస్ట్‌ట్యాగ్‌, NCMC కార్డ్‌ వంటివి టాప్‌-అప్‌ చేయకుండా, ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించకుండా.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) బుధవారం ఆంక్షలు విధించింది. ఈ ప్రభావంతో గురువారం ట్రేడింగ్‌లో 20% పతనమైన పేటీఎం షేర్లు, ఈ రోజు కూడా 20% లేదా రూ. 121.80 తగ్గి రూ. 487.20 దగ్గర లోయర్‌ సర్క్యూట్‌లో చిక్కుకున్నాయి. నిన్నటి పతనం ఫలితంగా రూ. 38.66 వేల కోట్లకు పడిపోయిన పేటీఎం మార్కెట్‌ విలువ (Paytm Market Cap), ఈ రోజు పతనం తర్వాత రూ. 30.94 వేల కోట్లకు దిగి వచ్చింది.

పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌కు (One97 Communications Limited) పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌లో 49% వాటా ఉంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన ఆంక్షల వల్ల కంపెనీ నిర్వహణ లాభం (operating profit) మీద ఏడాదికి రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ప్రభావం పడొచ్చని పేటీఎం అంచనా వేసింది. 2023 డిసెంబర్‌ నెలలో, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ ద్వారా 41 కోట్ల UPI ట్రాన్జాక్షన్లు జరిగాయి. పరిస్థితిని సమీక్షించి లాభదాయకత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తామని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేటీఎం వెల్లడించింది.

ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్‌:

ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై పేటీఎం మేనేజ్‌మెంట్‌ దృష్టి పెట్టింది. వివిధ విభాగాల్లో వ్యాపారాలకు సంబంధించి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌తోనే కాకుండా మరికొన్ని బ్యాంకులతో పేటీఎంకు ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి, PPBL మీద ఆంక్షలు మొత్తం పేటీఎం వ్యాపారాలపై ప్రభావం చూపదని పేటీఎం స్పష్టం చేసింది. పేమెంట్లు, ఇతర ఫైనాన్షియల్‌ సర్వీస్‌ల వ్యాపారాల ఇతర బ్యాంక్‌లతో ప్రస్తుతం ఉన్న ప్రస్తుత ఒప్పందాలను మరింత బలోపేతం చేస్తామని, కొత్త బ్యాంకులతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటామని పేటీఎం తెలిపింది. 

లోన్లు, ఇన్సూరెన్స్‌, ఈక్విటీ బ్రోకింగ్‌ లాంటి విభాగాల్లో వ్యాపారం కోసం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మీద తాము ఆధారపడలేదని, కాబట్టి ఆ వ్యాపారాల లాభదాయకత మీద ఆర్‌బీఐ ఆంక్షల ప్రభావం ఉండదని పేటీఎం స్పష్టం చేసింది. పేటీఎం QR, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషీన్‌ లాంటి సేవలు ఇకపైనా కొనసాగుతాయని, ఇంకా విస్తరిస్తామని తెలిపింది.

పేటీఎం స్టాక్‌ పని తీరు:

పేటీఎం షేర్‌ ధర గత ఆరు నెలల కాలంలో రూ.288.90 లేదా 37.22% తగ్గింది. 2023 నవంబర్‌ 23 తర్వాత ఈ స్క్రిప్‌ ఒక్కసారిగా పతనమైంది, 3 వారాల్లోనే దాదాపు 35% క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నా, RBI ఆంక్షల ప్రభావంతో గత రెండు రోజులుగా లోయర్‌ సర్క్యూట్స్‌లో ఉంది. గత ఒక ఏడాది కాలంలో దాదాపు 11%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 25% జారిపోయింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ తాయిలాల్లోనే కాదు, గ్యాస్‌ రేట్లలోనూ సామాన్యుడికి మొండిచెయ్యి

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments