Interest Rates Of Small Saving Schemes For Oct-Dec 2025: ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలలో, అగ్రరాజ్యం అమెరికాలో ఆశ్చర్యకరమైన రీతిలో వడ్డీ రేట్లలో 50 bps కోత పెట్టింది. అక్టోబర్ రెండో వారంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశమవుతుంది, వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో, 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్ 2024) చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠభరితంగా మారింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నెలాఖరులో ప్రకటన చేస్తుంది. దేశంలోని కోట్లాది మంది సామాన్య ఇన్వెస్టర్ల డబ్బును నేరుగా ప్రభావితం చేసే వడ్డీ రేట్లపై ఫైనాన్స్ మినిస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై అందరి దృష్టి ఉంది.
వడ్డీ రేట్లపై ఈ నెల 30న నిర్ణయం
ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలో పని చేసే ఆర్థిక వ్యవహారాల విభాగం, 2024-25 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), కిసాన్ వికాస్ పత్ర (KVP) సహా పోస్టాఫీస్ డిపాజిట్ పథకాల వడ్డీ రేట్లను ఈ నెలాఖరులో, అంటే 30 సెప్టెంబర్ 2024న ప్రకటిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు, అంతకుముందున్న రేట్లనే సర్కారు కొనసాగించింది. ఈసారి కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే, 2024 అక్టోబర్-డిసెంబర్ మధ్య, మూడో త్రైమాసికంలో కూడా ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకపోవచ్చు, గతంలోని రేట్లనే యథాతథంగా ఉంచే సూచనలు అందుతున్నాయి. అయితే, కేంద్ర బ్యాంక్ (RBI) నుంచి బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్లను కూడా తగ్గించే ఛాన్స్‌లు ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజన అధిక వడ్డీ
ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజనపై ఏడాదికి అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4 శాతం, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం, 3 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్‌పై 7.1 శాతం, 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీ ఆదాయం వస్తోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 8.2 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, కిసాన్ వికాస్ పత్రపై 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నారు.
పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు తీవ్ర నిరాశ
కేంద్ర ప్రభుత్వం, పీపీఎఫ్ తప్ప గత రెండేళ్లలో అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి PPF వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారణంగా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెడుతున్న ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు, బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు కాలం ప్రారంభం కానుంది. ఇకనైనా ప్రభుత్వం కరుణిస్తుందా అని పీపీఎఫ్ పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్నారు.
మరో ఆసక్తికర కథనం: జనం భరించలేని స్థాయిలో బంగారం, రూ.లక్ష దాటిన వెండి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి