Trump to lay off federal DEI staff: అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చున్న డొనాల్డ్ ట్రంప్, తన స్టైల్‌లో చెలరేగిపోతున్నారు. “అమెరికా ఫస్ట్” నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్, చివరకు అమెరికన్లను కూడా ఉపేక్షించడం లేదు. వైట్ హౌస్‌లోకి వచ్చీ రావడంతోనే, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆర్డర్లను రద్దు చేసిన ట్రంప్, ఆ తర్వాత భారీ సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. తాజాగా.. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ కార్యక్రమాల (federal diversity, equity and inclusion programs) మీద ఫోకస్ పెట్టారు. ఆ విభాగంలోని సిబ్బంది మొత్తానికీ లేఆఫ్ (LayOff)లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. లేఆఫ్‌లకు పూర్వరంగంగా, వాళ్లకు బలవంతపు సెలవులపై ఇళ్లకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పక్షపాత వ్యతిరేక శిక్షణ నుంచి మైనారిటీ రైతులు & గృహ యజమానులకు నిధులు సమకూర్చడం వరకు ప్రతిదానిపై ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (DEI) కార్యక్రమాలు ప్రభావం చూపుతాయి. అయితే, వాటిని రద్దు చేయాలని అమెరికా కొత్త అధ్యక్షుడు ఆదేశించారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బందిని వేతనంతో కూడిన సెలవుపై పంపించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో, ఆ సిబ్బందిని తొలగించే ప్రణాళికలను అమలు చేయమని ఏజెన్సీలను నిర్దేశిస్తూ ‘పర్సనల్ మేనేజ్‌మెంట్ ఆఫీస్’ మంగళవారం ఒక మెమో జారీ చేసింది.
బుధవారం సాయంత్రం వరకు డెడ్‌లైన్
ట్రంప్ ఆదేశానుసారం, బుధవారం సాయంత్రం 5 గంటల లోపు (అమెరికా కాలమానం ప్రకారం) DEI కార్యాలయ సిబ్బందిని వేతనంతో కూడిన సెలవులో పంపుతారు. అదే గడువు లోపు, అన్ని పబ్లిక్ DEI సంబంధిత వెబ్ పేజీలను కూడా తొలగించాలని కూడా పర్సనల్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ తన మెమోలో ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే, మెమోరాండం అందడానికి ముందే అనేక ఫెడరల్ డిపార్ట్‌మెంట్స్ ఆయా వెబ్ పేజీలను తొలగించాయి.
డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సంబంధిత శిక్షణ కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని & ఆ విభాగాలు కుదుర్చుకున్న అగ్రిమెంట్లను రద్దు చేయాలని కూడా ఆ మెమోలో ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ ఆదేశం రావడానికి ముందే కొన్ని వెబ్ సైట్లను తొలగించారు.
రెడీ అవుతున్న లే-ఆఫ్స్ లిస్ట్
ఎన్నికల రోజు నాటికి ఉన్న DEI కార్యాలయాలు & సిబ్బంది జాబితాను తయారు చేయాలని, గురువారం నాటికి ఈ పని పూర్తి చేయాలని కూడా సమాఖ్య ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఆ లిస్ట్‌ల ఆధారంగా, శుక్రవారం నాటికి, సమాఖ్య సిబ్బందిని తొలగింపులపై (లేఆఫ్‌లు) ఒక జాబితాను తయారు చేస్తారని భావిస్తున్నారు.
DEI సిబ్బంది లేఆఫ్‌లపై ట్రంప్ నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ, ఉద్యోగాల కోత మాత్రం ఖాయమని తెలుస్తోంది. దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు పోతాయాన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.
7 లక్షల మంది భారతీయుల్లో గుబులు
మరోవైపు, సరైన పత్రాలు లేకుండా అమెరికా వచ్చిన వాళ్లను తిరిగి పంపేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పడంతో, అగ్రరాజ్యంలో ఉంటున్న భారతీయుల్లో భయం వ్యక్తమవుతోంది. ట్రంప్ చేసే ఒక్క సంతకం దాదాపు 7.25 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపబోతోంది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది రైల్వే బడ్జెట్ కోసం రూ.3 లక్షల కోట్లు! – వందే భారత్ రైళ్లపైనే అందరి ఫోకస్
మరిన్ని చూడండి