Mark Zuckerberg: సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా ప్లాట్‌ఫారమ్స్ తన కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి పైరేటెడ్ పుస్తకాలను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది. కొత్తగా బహిర్గతం అయిన కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు పత్రాలలో, కాపీరైట్ చేసిన విషయం మెటాకు తెలిసే ఉపయోగించిందని రచయితల(Authors) బృందం ఆరోపించింది. మొదట 2023లో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, మెటా తన ల్యాంగ్వేజ్ మోడల్ లామాకు శిక్షణ ఇచ్చేందుకు తమ పుస్తకాలను దుర్వినియోగం చేసిందని వాదించింది.
ఏఐ సిస్టమ్స్ ను డెవలప్ చేయడానికి తమ సమ్మతి లేకుండా రచయితలు, ఆర్టిస్ట్ లు, ఇతర క్రియేటర్స్ నుంచి కాపీరైట్ చేసిన మెటీరియల్‌లను టెక్ కంపెనీలు ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. ఇది చట్టరిత్యా నేరమని వాదించింది. కానీ మెటా, ఇతర ప్రతివాదులు ఈ క్లెయిమ్‌లను వ్యతిరేకిస్తూ, అటువంటి మెటీరియల్‌లను ఉపయోగించడం న్యాయమైన ఉపయోగం (Fair Use) సూత్రం కిందకు వస్తుందని నొక్కి చెప్పారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన కోర్టు ఫైలింగ్‌లలో, మెటా ఏఐ (AI) శిక్షణ డేటాసెట్ లిబ్ జెన్ (LibGen)ని ఉపయోగించిందని రచయితలు చెప్పారు. ఇందులో మిలియన్ల కొద్దీ పైరేటెడ్ వర్క్‌లు ఉన్నాయని రాయిటర్స్ తెలిపింది. పీర్-టు-పీర్ టొరెంట్‌ల ద్వారా మెటా డేటాసెట్‌ను డిస్ట్రిబ్యూట్ చేసిందని వారు ఆరోపించారు. ఈ విషయంపై మెటా ఏఐ కార్యనిర్వాహక బృందం నుంచి హెచ్చరికలు ఉన్నప్పటికీ జుకర్ బర్గ్ లిబ్ జెన్ వినియోగానికి ఆమోదించారని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఈ ఎగ్జిక్యూటివ్‌లు లిబ్‌జెన్‌ను పైరేటెడ్ అని మాకు తెలిసిన డేటాసెట్ గా పేర్కొంటూ ఆందోళనలను వ్యక్తం చేశారు. దీన్ని సాక్ష్యంగా చేసుకుని ఫిర్యాదును దాఖలు చేయడానికి రచయితలు కోర్టును అనుమతి కోరారు. ఇది కాపీరైట్ జరిగిందనే వాదనలను మరింత బలపరుస్తుందని వారు చెబుతున్నారు.
ఏఐ సిస్టమ్స్ ను డెవలప్ చేయడానికి అనుమతి లేకుండా కాపీరైట్ చేసిన పనులను టెక్ కంపెనీలు ఉపయోగిస్తుంటాయి. అటువంటి సందర్భాలలో ప్రతివాదులు తరచుగా కాపీరైట్ చేసిన మెటీరియల్‌ని ఉపయోగించడం మంచి కోసమే ఉపయోగిస్తున్నామనే ట్యాగ్ ని జోడిస్తూ ఉంటారు. అయితే ఏఐ కంపెనీలు తమ సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడంలో కాపీరైట్ చేసిన ఈ మెటీరియల్‌ను ఎలా ఉపయోగిస్తాయి అన్న వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో మార్కా జుకర్ బర్గ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబుతున్నారన్న దానిపైనే అందరి దృష్టి ఉంది.
మరిన్ని చూడండి