Anant Radhika Wedding Cost: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12, శుక్రవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కూడా కొన్ని వేడుకలు నిర్వహించారు. నేషనల్ మీడియా అంచనాల ప్రకారం, ఈ వెడ్డింగ్ కోసం వేల కోట్ల రూపాయలను వెదజల్లారు. అనంత్ – రాధిక పెళ్లి కోసం ఎంత డబ్బు చేశారో తెలిసి దేశవ్యాప్తంగా జనాలు షాక్ అవుతున్నారు.
పెళ్లికి దాదాపు రూ.5,000 కోట్ల ఖర్చు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి కోసం ముకేష్ అంబానీ దాదాపు రూ. 5000 కోట్లు ఖర్చు చేశారని రెడ్డిట్‌లో ఒక పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. ఈ మొత్తం, ముకేష్ అంబానీ నికర విలువలో దాదాపు 0.5 శాతం. ఈ పెళ్లికి రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల వరకు ఖర్చవుతుందని తొలుత భావించారు. కానీ, అందరూ ఊహించిన మొత్తం కంటే చాలా భారీగా, ఎవరి ఊహలకు అందనంత డబ్బును ముకేష్ అంబానీ ఖర్చు చేసినట్లు సమాచారం. పెళ్లి కోసం వెచ్చించిన మొత్తంతో 10 సార్లు ఆస్కార్ ఈవెంట్ నిర్వహించవచ్చని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఔట్‌లుక్ రిపోర్ట్ ప్రకారం, అంబానీ కుటుంబం వారి నికర విలువలో కొంత భాగాన్ని వివాహానికి ఖర్చు చేసింది. సాధారణంగా, భారతీయ కుటుంబాలు, తమ నికర విలువలో 15 శాతం వరకు వివాహానికి ఖర్చు పెడుతున్నాయి.
భారత్‌తో పాటు విదేశాల నుంచి ప్రముఖులు
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహంతో అంబానీ కుటుంబం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారతదేశంలోని చిరస్మరణీయ కార్యక్రమంగా విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. పెళ్లి పిలుపు అందుకున్న అతిథుల జాబితా ప్రపంచవ్యాప్తంగా ఉంది. బాలీవుడ్, హాలీవుడ్, క్రీడలు, వ్యాపారం, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు పిలుపులు వెళ్లాయి. కిమ్ కర్దాషియాన్, జాన్ సెనా, అడెలె వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా పెళ్లిలో భాగమయ్యారు.
అతిథులకు ఖరీదైన బహుమతులు
పెళ్లికి హాజరైన అతిథులకు ఖరీదైన బహుమతులు, సేవలు అందించారు. ప్రైవేట్ చార్టర్ విమానాల నుంచి లగ్జరీ కార్లు, లూయిస్ విట్టన్ బ్యాగులు, బంగారు గొలుసులు, డిజైనర్ షూలు వంటివన్నీ అతిథులకు అందుబాటులో ఉంచారు. పాప్ సంచలనం జస్టిన్ బీబర్ పెళ్లి వేడుకల్లో అలంకరించాడు. రాపర్లు బాద్షా, కరణ్ ఔజిలా కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటి
వివాహ వేడుకల కోసం దాదాపు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు జాతీయ మీడియా అంచనా వేసింది. బ్రిటన్ యువరాణి డయానా – ప్రిన్స్ చార్లెస్‌ల వివాహం కోసం రూ. 1,361 కోట్లు, షేక్ హింద్ బింట్ బిన్ మక్తూమ్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వివాహం కోసం రూ. 1,144 కోట్లను ఖర్చు చేశారు. అంబానీ ఇంట పెళ్లి ఖర్చు వాటిని తోసిరాజంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా చెబుతున్నారు. వివాహ వేడుకల్లో అలరించిన రిహానాకు రూ. 74 కోట్లు, జస్టిన్ బీబర్‌కు రూ. 83 కోట్లు ఇచ్చారు. పెళ్లికి ముందు నిర్వహించిన కార్యక్రమాలకు రూ. 2500 కోట్లు ఖర్చు చేసినట్లు డైలీ మెయిల్ కథనం రాసింది.
మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు – PPF కంటే ఎక్కువ వడ్డీ రాబడి
మరిన్ని చూడండి