Homeఆర్థికంఒక్క మార్పుతో రూ.8.50 లక్షల ఆదాయంపైనా పైసా పన్ను కట్టక్కర్లేదు!

ఒక్క మార్పుతో రూ.8.50 లక్షల ఆదాయంపైనా పైసా పన్ను కట్టక్కర్లేదు!


Budget 2024 Expectations: మోదీ 3.0 హయాంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) తన తొలి బడ్జెట్‌ను ఈ నెల 23న ప్రకటించనున్నారు. ఇది, నిర్మల సీతారామన్‌ నుంచి వరుసగా ఏడో బడ్జెట్ ప్రజెంటేషన్ అవుతుంది. కేంద్ర బడ్జెట్ 2024 ప్రకటనకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ దానిపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, పన్ను చెల్లింపుదార్లు, మధ్య తరగతి కుటుంబాలు చాలా ఉపశమనాలు ఆశిస్తున్నారు. ప్రాథమిక పన్ను మినహాయింపు (basic tax exemption) పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని, కొత్త పన్ను విధానంలో కొత్త డిడక్షన్‌ బెనిఫిట్స్‌ ఉండాలని కోరుకుంటున్నారు.

కొత్త పన్ను విధానంలో ప్రస్తుత మినహాయింపు ప్రయోజనాలు

ప్రస్తుతం, కొత్త పన్ను విధానంలో (new tax regime) రూ. 50,000 ప్రామాణిక తగ్గింపును (standard deduction) అనుమతిస్తున్నారు. పాత పన్ను విధానంలో (old tax regime) అందుబాటులో ఉన్న ఇతర మినహాయింపులు, తగ్గింపులు కొత్త విధానానికి వర్తించవు.

మరికొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్‌లో, టాక్స్‌ శ్లాబ్స్‌లో పెద్ద మార్పులు ఉంటాయని టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో బేసిక్‌ టాక్స్‌ ఎగ్జంప్షన్‌ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలకు చాలా ఉపశమనం లభిస్తుంది. పన్ను రహిత ఆదాయ పరిమితి భారీగా పెరిగి, చేతిలో డబ్బు మిగులుతుంది. ఆ డబ్బును ఉపయోగించి పొదుపు లేదా పెట్టుబడులు పెంచుతారు. వస్తువులు, సేవలు కొనుగోలు చేస్తారు. అంతిమంగా.. వినియోగం పెరిగి ఆ డబ్బంతా తిరిగి ప్రభుత్వం వద్దకే చేరుతుంది, వృద్ధి రేటు పరుగులు పెడుతుంది.

ప్రస్తుతం, పన్ను విధించదగిన ఆదాయం రూ. 7 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉంటే సెక్షన్‌ 87A కింద రిబేట్‌ రూపంలో రూ. 25,000 వరకు ఉపశమనం లభిస్తుంది. ఈ ప్రకారం… రూ. 3 లక్షల ప్రాథమిక పన్ను మినహాయింపునకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 + రిబేట్‌ను కలుపుకుంటే రూ. 7.50 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం. 

బేసిక్‌ టాక్స్‌ ఎగ్జంప్షన్‌ పరిమితిని రూ.5 లక్షలకు పెంచితే పన్ను రహిత ఆదాయం ఎంత?

కొత్త పన్ను విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపును రూ. 5 లక్షలకు పెంచితే పన్ను రహిత ఆదాయ పరిమితి పూర్తిగా మారిపోతుంది. రూ. 8.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

పెరిగిన మినహాయింపు పరిమితి రూ. 5 లక్షలకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000గా ఉంటుంది. సెక్షన్ 87A కింద పన్ను రాయితీని కూడా ఇక్కడ కలుపుకోవాలి. పన్ను విధించదగిన ఆదాయం రూ. 8 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉంటే రూ. 25,000 వరకు రిబేట్‌ వర్తిస్తుంది. పర్యవసానంగా, పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఆదాయం రూ. 8.50 లక్షలు అవుతుంది. స్టాండర్డ్‌ డిడక్షన్‌, రిబేట్‌ను మార్చకుండా బేసిక్‌ టాక్స్‌ ఎగ్జంప్షన్‌ పరిమితిని మాత్రమే పెంచితే ఈ లెక్క సరిపోతుంది. స్టాండర్డ్‌ డిడక్షన్‌, రిబేట్‌ను కూడా సవరిస్తే పన్ను రహిత ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర కథనం: ప్రతి నెలా రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవాలంటే NPSలో ఎంత పెట్టుబడి పెట్టాలి?



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments