Section 80C of the Income Tax Act: ఆదాయ పన్ను పత్రాలు (ITR) దాఖలు చేసే సమయంలో, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C చాలా కీలకం. ఇది చాలా రకాల మినహాయింపులు (Exemption) అందిస్తుంది, పన్ను ఆదా విషయంలో సాయం చేస్తుంది. సెక్షన్ 80C సాయంతో, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందొచ్చు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు (Individual Income Tax Payers), HUF (హిందూ అవిభక్త కుటుంబం) మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందగలరు.
పాత పన్ను విధానంలో మాత్రమే వర్తింపు
పాత పన్ను విధానానికి (Old Tax Regime) మాత్రమే ఆదాయ పన్ను సెక్షన్లు వర్తిస్తాయి కాబట్టి, మీరు పాత పన్ను ఉంటే సెక్షన్ 80C ప్రయోజనాన్ని పొందొచ్చు. దీని కోసం కొంత కసరత్తు అవసరం. NSC, ULIP, PPF వంటి అనేక పెట్టుబడి సాధనాలు ఇందులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే, రూ.1.5 లక్షల ఆదాయం వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
సెక్షన్ 80C
ఈ సెక్షన్ కింద, EPF, PPF వంటి ప్రావిడెంట్ ఫండ్స్‌లో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు (Tax Exemption) పొందొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Life Insurance Premium), ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS), ఇంటి రుణం (Home loan), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద లభించే మినహాయింపులతోపాటు, మరికొన్ని ఉప సెక్షన్లు కింద మరికొన్ని మినహాయింపులు పొందొచ్చు.
సెక్షన్ 80CCC
పెన్షన్ ప్లాన్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
సెక్షన్ 80CCD(1)
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి ప్రభుత్వ మద్దతు గల పథకాల్లో పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందుతారు.
సెక్షన్ 80 CCD(1B)
NPSలో రూ.50 వేల వరకు కంట్రిబ్యూషన్‌కు ఈ సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది.
సెక్షన్ 80 CCD(2)
NPSలో ఉపాధి ప్రదాత వాటాకు ఈ సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది.
ఈ పెట్టుబడులకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది:
జీవిత బీమా ప్రీమియం
జీవిత బీమా పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంతో పన్ను ప్రయోజనం లభిస్తుంది. మీరు, మీ జీవిత భాగస్వామి, పిల్లల కోసం పాలసీ తీసుకుని, క్లెయిమ్ చేసుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) సభ్యులు కూడా ఇలాంటి ప్రయోజనాలకు అర్హులు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
PPFలో జమ చేసిన డబ్బుకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఇస్తుంది. ఇందులో, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
నాబార్డ్ రూరల్ బాండ్
నాబార్డ్ రూరల్ బాండ్స్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేసినా పన్ను మినహాయింపు లభిస్తుంది.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP)
యులిప్‌లు దీర్ఘకాలంలో మంచి రాబడిని అందిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి పన్ను మినహాయింపు పొందొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
తక్కువ రిస్క్ పథకాల్లో NSC ఒకటి. ఇది, 5 నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అవుతుంది. ఇందులో ఎంత డబ్బునా పెట్టుబడిగా పెట్టవచ్చు. కానీ, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడికి మాత్రమే మినహాయింపు అందుబాటులో ఉంటుంది.
పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ (Tax saving fixed deposit)
బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా వీటిలో పెట్టుబడి పెట్టొచ్చు. వీటి లాక్-ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. ఈలోపు డబ్బు వెనక్కు తీసుకోవడం కుదరదు.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF)
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేసిన మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ.. ఈ రెండూ పన్ను మినహాయింపును అందిస్తాయి. ఈ ప్రయోజనాన్ని పొందడానికి మీరు కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండాలి.
మౌలిక సదుపాయాల బాండ్లు (Infrastructure Bonds)
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
ELSS
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ కింద కూడా పన్ను మినహాయింపు పొందుతారు. ఈ పథకాల లాక్-ఇన్ వ్యవధి 3 సంవత్సరాలు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్
SCSSలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడికి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే మీ వయస్సు 60 ఏళ్లు పైబడి ఉండటం తప్పనిసరి.
గృహ రుణం
గృహ రుణం కింద చెల్లించే అసలుపై (Principal Amount) పన్ను మినహాయింపు పొందొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన
బాలికల కోసం నిర్వహిస్తున్న ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో జమ చేసే డబ్బుకు కూడా పన్ను మినహాయింపు లభిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఇంటి ఓనర్ పాన్ ఇవ్వకపోయినా HRA క్లెయిమ్ చేయొచ్చు, ఎలాగో తెలుసా?