నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూజీసీ నెట్-2024 పరీక్షను జూన్ 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకాల్లో, పీహెచ్‌డీలో ప్రవేశాలకు యూజీసీ నెట్ నిర్వహిస్తారు. ఈ ఏడాది నెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 11,21,225 మంది అభ్యర్థులు నెట్ పరీక్షకు నమోదు చేసుకున్నారు. వీరిలో 6,35,587 మంది మహిళలు, 4,85,579 మంది పురుషులు, 59 మంది థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు. అయితే రెండు షిఫ్టులకు 9,08,580 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షకు నమోదు చేసుకున్న అభ్యర్థులలో 81% మంది పరీక్షకు హాజరయ్యారని ఎన్టీఏ ప్రకటించింది. నిన్న సాయంత్రం ప్రకటనలో యూజీసీ నెట్ ను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొంది. ఇంతలో కేంద్రం నుంచి అందిన సమాచారంతో పేపర్ లీకైనట్లు తెలిసింది. దీంతో యూజీసీ నెట్-జూన్ 2004 పరీక్ష రద్దు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నీట్ పరీక్షలో అవకతవకలతో ఎన్టీఏ పేరు మసకబారింది. తాజాగా నెట్ పేపర్ లీక్ తో ఎన్టీఏ పరీక్ష నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.