Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో సాగుతోన్న మహా కుంభమేళా 2025 ఉత్సవాలకు కోట్లాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు తరలి వస్తున్నారు. జనవరి 11 నుంచి జనవరి 16 వరకు కేవలం ఆరు రోజుల్లోనే 7 కోట్ల మంది ప్రజలు సంగం, ఇతర ఘాట్‌లలో పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు చేశారు. ఈ చారిత్రాత్మకమైన సమావేశం మహా కుంభ్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఈవెంట్ ముగిసే సమయానికి 45 కోట్ల మంది భక్తులు వస్తారని ముందుగా భావించారు. కానీ ప్రస్తుత సంఖ్యను బట్టి చూస్తుంటే అంతకన్నా ఎక్కువ మంది యాత్రికులు పాల్గొంటారని భావిస్తున్నారు.
ఉత్సవాల సమయంలో రద్దీ దృష్ట్యా మహా కుంభమేళా 2025 ప్రారంభం కాకముందు నుంచే చాలా మంది ప్రయాగ్ రాజ్ బాట పట్టారు. పవిత్ర గంగా నదిలో స్నానాలు చేశారు. జనవరి 11న, దాదాపు 4.5 మిలియన్ల మంది భక్తులు పవిత్ర స్నానం చేయగా, జనవరి 12న 6.5 మిలియన్ల మంది భక్తులు స్నానాలాచరించి కొత్త రికార్డు సృష్టించారు. అధికారికంగా మేళా ప్రారంభానికి ముందే, 10 మిలియన్లు అంటే కోటిపై పైగా ప్రజలు ఘాట్‌ల వద్ద స్నానాలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక మహా కుంభమేళా ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లో అధిక మంది ప్రయాగ్ రాజ్ కు తరలివచ్చారు. గణాంకాల ప్రకారం పుష్య పూర్ణిమ, జనవరి 13న 1.7కోట్ల మంది, జనవరి 14 సంక్రాంతి రోజు అమృత స్నానం సందర్భంగా 3.5కోట్ల మంది వచ్చారు. దీంతో కేవలం 48 గంటల్లోనే మహా కుంభమేళాలో స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 5.2కోట్లకు చేరుకుంది. జనవరి 15న మరో 40 లక్షల మంది, 16న 30లక్షల మంది స్నానాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భారీ సంఖ్యలో మిలియన్ల మంది ప్రజల లోతైన విశ్వాసం, భక్తిని ప్రతిబింబిస్తున్నాయి.
మహా కుంభమేళాను పురస్కరించుకుని వస్తోన్న భక్తుల తాకిడితో పరిసర ప్రాంతాలూ రద్దీగా మారాయి. శృంగ్వేర్‌పూర్, చిత్రకూట్, వారణాసి, మా వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాలకూ సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. జనవరి 13 నుంచి 15 తేదీల్లో అయోధ్యను దాదాపు 10 లక్షల మంది సందర్శించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని 741,000 మంది, వింధ్యవాసిని ధామ్ 5లక్షల మంది, లక్ష మంది భక్తులు సీతాపూర్‌లోని నైమిశారణ్య ధామ్‌ని సందర్శించారు. ఈ సందర్శనలు స్థానిక ఉపాధికి గణనీయంగా దోహదపడ్డాయి. ప్రయాణం, ఆతిథ్యం, రవాణా రంగాలలో వ్యాపారాలను మరింత పెంచాయి.
ఆర్థిక ప్రభావం
మహా కుంభమేళా కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు, ఉత్తర ప్రదేశ్, దేశానికి ముఖ్యమైన ఆర్థిక చోదకమైనది కూడా. ఈ ఉత్సవాలు హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వేలు, రోడ్డు రవాణా వంటి పరిశ్రమలకు ప్రయోజనం చేకూర్చుతున్నాయి. భారతదేశం అంతటా, విదేశాల నుంచి వస్తోన్న పర్యాటకులతో స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో దూసుకుపోతోంది. రాబోయే వారాల్లో ఈ మేళాలో లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉన్నందున, మహా కుంభమేళా ప్రపంచ స్థాయిలో విస్మయాన్ని, భక్తిని ప్రేరేపిస్తూనే ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Also Read : Maha Mandaleswar: ఐటీ ఉద్యోగాన్ని వదిలి అఖారాలో మహామండలేశ్వరుడిగా దీక్ష చేపట్టిన యూఎస్ యువకుడు
మరిన్ని చూడండి