Maharasta Ex CM Sarad Pawar New Party: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అంటారు అనుభవజ్ఞులు. అయితే.. ఎంత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. ఏదో ఒక కారణం ఉండాలి కదా! కానీ, రాజకీయాల్లో ఆ కారణాలు వ్యక్తిగతం కాకపోవచ్చు.. కార్యాకారణ సంబంధంగా అవి నాయకుల జీవితాలకు పరీక్షాకాలంగా మారతాయి. వీటిని తట్టుకుని నిలబడితే.. సరే, లేకుంటే.. ఇదిగో ఇప్పుడు మహారాష్ట్ర(Maharastra)లో కీలకమైన, నిన్న మొన్నటి వరకు వారి కనుసైగలతో రాజకీయాలను శాసించి.. ఇప్పుడు చతికిల పడిన నాయకుల మాదిరిగానే మిగిలిపో వాల్సి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు.. మహరాష్ట్ర రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాం శం అయింది. మరి దీనికి కారణమేంటి? ఎందుకు? చదివేద్దాం..
పొత్తు రాజకీయం తెచ్చిన చేటు!
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ(PM Narendra Modi) పాగా వేసిన దరిమిలా.. దేశవ్యాప్తంగా బీజేపీని విస్తరించే కార్యక్ర మాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారికి ముందుగా అందివచ్చిన రాష్ట్రాలపై కన్నేశారు. ఇలా.. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. అక్కడి ప్రాంతీయ పార్టీ శివసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. మెజారిటీ విషయంలో శివసేన కంటే కూడా.. బీజేపీ కొన్ని స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. అయితే.. శివసేనకు, బీజేపీకి మధ్య ముఖ్యమంత్రి పీఠం విషయం రగడకు దారి తీసింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కటీఫ్ చెప్పిన శివసేన అప్పటి అధిపతి.. ఉద్దవ్ ఠాక్రే.. కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వం(అప్పటి)లోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మహా వికాసీ ఘడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అయితే.. అధికారం చేతిదాకా వచ్చి.. జారిపోవడంతో నిద్రపట్టని బీజేపీ (BJP).. శివసేన (Shivasena) కూటమిలో చిచ్చును పరోక్షంగా రాజేసింది. ఈ క్రమంలో అప్పటి ఉద్దవ్ ఠాక్రే (Udhdhav Thakare) కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)ను బయటకు వచ్చేలా ప్రోత్సహించి.. ఎట్టకేలకు షిండే నేతృత్వంలో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా సర్కారును నడిపిస్తున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. శివసేన నుంచి బయటకు వచ్చిన ఏక్‌నాథ్ షిండే.. ఆ పార్టీ సహా ఎన్నికల గుర్తయిన పులి బొమ్మను కూడా తనవేనని చాటుకున్నారు. న్యాయపోరాటాలు కూడా చేశారు. ఎన్నికల సంఘంలోనూ అఫిడవిట్లు వేశారు. మొత్తానికి విజయం దక్కించుకున్నారు. దీనంతటికీ.. అమిత్ షా నే తన వెనుక ఉన్నారని షిండే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారు. కట్ చేస్తే.. ఒకప్పుడు రాష్ట్రాన్ని..పార్టీని కూడా తన కనుసైగతో శాసించిన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు కీలక ఎన్నికల సమయంలో పార్టీలేదు. గుర్తులేదు.. అన్నట్టు ఏకాకిగా మారిపోయారు.
శరద్ పవార్ విషయం ఇదీ..
మహా వికాస్ అఘాడీలో కీలకమైన పార్టీ ఎన్సీపీ, దీనికి శరద్ పవార్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే.. ఈ అఘాఢీ సజీవంగా అలానే ఉంటే.. పార్లమెంటు ఎన్నికల్లో తమకు ముప్పుదని భావించిన బీజేపీ.. శివసేనను చీల్చినట్టే.. ఎన్సీపీలోనూ భారీ చీలిక తీసుకువచ్చింది. సొంత సొదరుడి కుమారుడే శరద్ పవార్.. పవర్‌కు చెక్ పెట్టి.. తనతో ఎమ్మెల్యేలను లాక్కుపోయారు.. అజిత్ పవార్. అంతేకాదు.. ప్రస్తుత బీజేపీ-షిండే వర్గ శివసేన కూటమి ప్రభుత్వంలో అజిత్ చేరిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. అంతేకాదు.. అసలు ఎన్సీపీ కూడా నాదేనన్నారు. గుర్తు `గాలిపటం` కూడా తనదేనన్నారు. అంతే.. పైవాడి అండ ఉండడంతో సాఫీగా సాగిపోయి… ఒకప్పుడు సుప్రిమో అంటూ.. ఎన్సీపీని ఏలిన శరద్ పవార్ చేతులు ముడుచుకుని కూర్చున్నారు.
తాజాగా..
తాజాగా మహారాష్ట్ర ఎన్సీపీ పూర్తిగా అజిత్ పవార్(Azith pawar) చేజిక్కించుకోవడంతో ఆ పార్టీని ఒకప్పుడు పెంచి పోషించిన శరద్ పవార్.. కొత్త పార్టీ స్థాపించారు. అదే.. “నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్ చంద్ర పవార్ పార్టీ`(Nationalist Congress Shard Chandra Pawar party). వచ్చే ఎన్నికల్లో తన వర్గం(ప్రస్తుతం మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే. ఒక ఎంపీ ఆయన కుమార్తె సుప్రియా సూలే)తో పార్లమెంటు ఎన్నికలకు వెళ్తామని. అయితే.. ఎలా చూసుకున్నా.. అటు శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఇటు శరద్ పవార్‌లు.. ఇద్దరూ కేవలం రెండంటే రెండేళ్లలో నామమాత్రంగా, నిమిత్తమాత్రంగా.. ఒంటరి పక్షులుగా మిగిలిపోవడం గమనార్హం. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 48 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ మొత్తం స్థానాలను తన గుప్పిట పెట్టుకునే అవకాశందక్కడం గమనార్హం. గత ఎన్నికలలో 28 స్థానాల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా అన్ని చోట్లా విజయం దక్కించుకునేందుకే. . తనను వ్యతిరేకించిన పక్షాన్ని అచేతనం చేయడం గమనార్హం. దటీజ్ పాలిటిక్స్!!
మరిన్ని చూడండి