Mahadev Betting App Issue : దేశంలో దుమారం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App)మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్ ( Ravi Uppal )ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directrate)అభ్యర్థనతో…ఇంటర్‌పోల్ (Interpoll)జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రవి ఉప్పల్‌ను గత వారమే అదుపులోకి తీసుకున్నట్లు దుబాయి పోలీసులు వెల్లడించారు. రవి ఉప్పల్ ను భారత్‌కు తీసుకొచ్చేందుకు దుబాయి అధికారులతో ఈడీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం…మహదేవ్ బెట్టింగ్ యాప్ సహా మరో 21 రకాల సాఫ్ట్‌వేర్‌లు, వెబ్‌సైట్లను నిషేధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో మహదేవ్, రెడ్డీ అన్న ప్రెస్టోప్రో యాప్ లు ఉన్నాయి. చట్టవిరుద్ధమైన సిండికేట్ బెట్టింగ్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును అనుసరించి కేంద్రం చర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్ యాప్ కు సంబంధించిన పలు చోట్ల సోదాలు నిర్వహించింది ఈడీ. ఆ యాప్ ద్వారా నిర్వాహకులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినట్లు తెల్చింది. అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్‌తో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి సంబంధం ఉందంటూ ఈడీ ఆరోపించింది. భూపేశ్ బఘేల్, తనను యూఏఈ వెళ్లాలని ఆదేశించారంటూ యాప్ కేసులో నిందితుడు శుభం సోనీ ఓ వీడియో విడుదల చేశారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 69ఎ ప్రకారం వెబ్‌సైట్‌ను నిషేధించాలని ప్రతిపాదించే అధికారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ…బఘేల్ పట్టించుకోలేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటులు ఆన్‌లైన్‌లో యాప్‌ను ప్రచారం చేసి, అందుకు బదులుగా ప్రమోటర్ల నుంచి డబ్బు అందుకున్నారన్నది ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో 14 నుంచి 15 మంది సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్ , హాస్యనటుడు కపిల్ శర్మ, నటీమణులు హ్యూమా ఖురేషి, శ్రద్దాకపూర్ , హీనా ఖాన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా
మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ భారత్‌లో 4వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. ఒక్కో ఆపరేటర్‌కు సుమారు 200 మంది కస్టమర్లున్నారు. దీని ప్రకారం రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతోంది. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము తరలిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రూ.417 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ శుక్రవారం సీజ్ చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు తాజాగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది.