Homeఅంతర్జాతీయంబీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డా నియామకం - కాంగ్రెస్ శుభాకాంక్షలు

బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డా నియామకం – కాంగ్రెస్ శుభాకాంక్షలు


Latest News in Telugu: రాజ్యసభా పక్ష నేతగా కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా నియమితులయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. నడ్డా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పీయూష్ గోయల్ ముంబయి ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచి లోక్ సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి, రాజ్యసభలో పక్ష నేతగా జేపీ నడ్డాను ఎంపిక చేశారు.

పీయూష్ గోయల్ రాజ్యసభ ఎంపీగా 2010 జూలై 5 నుంచి కొనసాగుతున్నారు. రాజ్యసభా పక్ష నేతగా 2021 జూలై 14 నుంచి ఉన్నారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పీయూష్ గోయల్ లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాబట్టి, రాజ్యసభ సభ్యత్వం వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు, జేపీ నడ్డా 2012 ఏప్రిల్ 3న రాజ్యసభ ఎంపీగా తొలిసారి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజ్యసభ ఎంపీగానే ఎన్నికవుతూ వస్తున్నారు.

రాజ్యసభాపక్ష నేతగా ఎంపికైన జేపీ నడ్డాకు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతిపక్ష వాదనలకు కూడా సభలో చోటు కల్పించేలా జేపీ నడ్డా వ్యవహరించాలని కోరారు. ‘‘రాజ్యసభాపక్ష నేతగా ఎంపికైన జేపీ నడ్డాకు శుభాకాంక్షలు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో చెప్పిన విధంగా సభా నాయకుడు విపక్షానికి కూడా అవకాశం కల్పించగలిగితే, ప్రతిపక్షం తప్పక సహకరించగలదు’’ అని జైరాం రమేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments