BSNL Call Charges: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’ (BSNL) తన లోగోను కొత్తగా & ఆకర్షణీయంగా మార్చింది. ఊదా రంగు సర్కిల్‌ను కాషాయం రంగులోకి మార్చింది. దేశం మొత్తాన్ని కవర్ చేస్తామంటూ సూచించే బాణపు గుర్తులు కూడా తెలుపు, పచ్చటి రంగులోకి మారాయి. దీంతో, జాతీయ పతాకంలోని త్రివర్ణాలు (కాషాయం, తెలుపు, పచ్చ) రంగులు బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త లోగోలోకి వచ్చి చేరాయి. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సర్కిల్‌లోకి ఇప్పుడు భారతదేశ పటం వచ్చి చేరింది. దీంతోపాటు.. భద్రత, స్థోమత, విశ్వసనీయత (Security, Affordability and Reliability) అనే పదాలను కూడా కొత్త లోగోలో ‘భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్’ జోడించింది. బీఎస్‌ఎన్‌ఎల్ పాత లోగోలోని ‘కనెక్టింగ్ ఇండియా’ (Connecting India) నినాదం కొత్త లోగోలో ‘కనెక్టింగ్ భారత్’ (Connecting Bharat)గా రూపాంతరం చెందింది.
లోగో మార్చడంతో పాటు, 7 కొత్త సర్వీసులను కూడా బీఎస్‌ఎన్‌ఎల్ లాంచ్ చేసింది. కొత్త లోగోను లాంచ్ చేసిన కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. “7 ఇన్ ఆల్” పేరిట బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సేవలను ప్రారంభించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్తగా ప్రారంభించిన సేవలు ఏమిటి?
కొత్త సర్వీసుల్లో మొదటిది.. స్పామ్ కమ్యూనికేషన్స్ ఉండని ఫీచర్. మోసపూరిత & దుర్బుద్ధితో కూడిన ఫోన్ కాల్స్, SMSలను ఈ ఫీచర్ ఫిల్టర్ చేస్తుంది. అంటే, యూజర్‌కు ఆ కాల్ రాకముందే గుర్తించి, కాల్ కనెక్ట్ కాకుండా నివారిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వై-ఫై రోమింగ్ (BSNL WiFi Roaming), బీఎస్‌ఎన్‌ఎల్ ఎఎఫ్‌టీవీ (BSNL IFTV), ఎనీటైమ్ సిమ్ (ATS) కియోస్క్‌లు, డైరెక్ట్ టు డివైజ్ సర్వీస్, పబ్లిక్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రిలీఫ్, ప్రైవేట్ 5G ఇన్ మైనర్స్ సౌకర్యాలను కూడా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ లాంచ్ చేసింది.
BSNL వైఫై రోమింగ్ ఫెసిలిటీ FTTH (ఫైబర్-టు-ది-హోమ్) కస్టమర్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ఫెసిలిటీ కోసం ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. BSNL IFTV ఫైబర్ ఆధారిత ఇంట్రానెట్ టెలివిజన్ సేవలను అందిస్తుంది. దీనితో మీరు 500కి పైగా లైవ్ ఛానెల్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇది బ్రాడ్‌బ్యాండ్ డేటాను తీసుకోదు.
నెట్‌వర్క్ లేనప్పుడు కూడా UPI చెల్లింపు
‘డైరెక్ట్-టు-డివైజ్’ సౌకర్యంతో, మొబైల్ ఫోన్‌కు నేరుగా శాటిలైట్ నుంచి అత్యుత్తమ టెలికమ్యూనికేషన్ లింక్ ఏర్పడుతుంది. నెట్‌వర్క్ లేనప్పుడు కూడా కస్టమర్‌లు టెక్ట్స్ మెసేజ్‌లు పంపడం, UPI చెల్లింపులు చేయడం వంటివి ఈ సర్వీస్‌తో వీలవుతాయి. మూరుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలకు ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది.
BSNL సిమ్ కొనాలనుకునే యూజర్లకు 24 గంటలూ అందుబాటులో ఉండే ATSను ఈ కంపెనీ ప్రారంభిస్తోంది. ఈ కియోస్క్ ఆటోమేటిక్‌గా పని చేస్తుంది. రోజులో ఎప్పుడైనా BSNL ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
బొగ్గు గనుల కోసం భారతదేశంలోనే మొట్టమొదటి 5G నెట్‌వర్క్‌ను కూడా BSNL ప్రారంభించింది. అదే ప్రైవేట్ 5G ఇన్ మైనర్స్ ఫీచర్.
కాల్ ఛార్జీల పెంపుపై క్లారిటీ
ప్రైవేట్ రంగ టెలికాం ప్లేయర్లయిన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కొన్నాళ్ల క్రితం మొబైల్ టారిఫ్‌లను పెంచాయి. అయితే, కాల్ ఛార్జీలను పెంచే ఆలోచన తమకు బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ రాబర్ట్ రవి చెప్పారు. ఈ ఏడాదిలోనే 4G కమర్షియల్ సర్వీస్‌లు ప్రారంభిస్తామన్నారు.
మరో ఆసక్తికర కథనం: ‘గోల్డ్ రష్’కు ముగింపు ఎప్పుడు? – ఈ రోజు బిస్కట్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్, సిల్వర్ రేట్లివి
మరిన్ని చూడండి